ఈ చిన్నారి ట్యాలెంట్ కు ముగ్ధుడైన ప్రధాని మోదీ

  • ఐదేళ్లకే కీబోర్డుపై స్వరాలు పలికిస్తున్న కన్నడ చిన్నారి
  • తల్లి పాట పాడుతుంటే పియోనోపై స్వరాలు
  • అసాధారణ ప్రతిభ అంటూ మెచ్చుకున్న ప్రధాని
ఓ చిన్నారి కీబోర్డుపై స్వరాలు పలికించడం, అది విన్న వారిని కట్టి పడేయడం అంటే చిన్న విషయం కాదు. ఏకంగా ప్రధాని మోదీ సైతం ఈ చిన్నారి ప్రతిభకు ముగ్ధులయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. షలమలీ అనే ఈ చిట్టి పాపకు గట్టిగా ఐదేళ్లు కూడా ఉండవు. కానీ, తన తల్లి పాడుతున్న పాటకు స్వరాలు పలికించింది. పల్లవాగల పల్లవియాలి అంటూ ఆమె తల్లి పాట పాడడాన్ని, చిన్నారి స్వరాలు అందించడాన్ని వీడియోలో చూడొచ్చు. అంత చిన్న వయసుకే సంగీత స్వరాలు నేర్చుకుని, పియానోపై వాటిని కచ్చితంగా పలికించడం చూసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది.

ఈ పాటని కన్నడ రచయిత కేఎస్ నరసింహ స్వామి రచించారు. ఈ వీడియోని మొదట అనంత కుమార్ షేర్ చేశారు. దీన్ని ప్రధాని చూసి రీట్వీట్ చేశారు. ‘‘ఈ వీడియో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వును పూయిస్తుంది. అసాధారణ ప్రతిభ, సృజనాత్మకత కలిగిన షలమలీకి శుభాకాంక్షలు’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. పాటకు స్వరాలు అద్భుతంగా ఉన్నాయని, ప్రతి 10వేల మందిలో ఒకరు ఈ చిన్నారి మాదిరిగా అసాధారణ ప్రతిభతో ఉంటారంటూ కామెంట్లు వస్తున్నాయి.


More Telugu News