సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్

  • 72 గంటల పాటు కాల్పుల విరమణకు సైన్యం, పారామిలిటరీ అంగీకారం
  • ఊపందుకున్న విదేశీయుల తరలింపు ప్రక్రియ
  • విదేశీయుల తరింపు పూర్తయ్యాక పరిస్థితి మరింత దిగజారొచ్చని నిపుణుల ఆందోళన
సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ దళాల ఘర్షణల మధ్య చిక్కుకుపోయిన భారతీయులకు ఓ గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా 72 గంటల పాటూ కాల్పులు విరమించేందుకు ఇరు వర్గాలు ఏప్రిల్ 24న అంగీకరించాయి. విదేశీయులను సురక్షితంగా దేశం దాటించేందుకు వీలుగా ఘర్షణలకు విరామం ప్రకటించాయి. దీంతో, తమ పౌరులను వెనక్కు రప్పించేందుకు వివిధ దేశాలు ప్రయత్నాలు వేగవంతం చేశాయి.  

సూడాన్‌లో సైన్యం, పారామిలిటరీ దళాల ఘర్షణల కారణంగా ఇప్పటివరకూ సుమారు 400 మంది బలయ్యారు. విదేశీయులు భారీ సంఖ్యలో సూడాన్‌ను వీడుతున్నారు. తమ పౌరులను సురక్షితంగా వెనక్కు రప్పించుకునేందుకు భారత సహా అనేక దేశాలు రంగంలోకి దిగాయి. ఆపరేషన్ కావేరి పేరిట కేంద్రం భారతీయుల తరలింపు చేపడుతోంది.

ఇదిలా ఉంటే, సూడాన్‌లో ప్రస్తుత ఘర్షణలు అంతర్యుద్ధంగా మారొచ్చని అక్కడి పౌరులు భయపడిపోతున్నారు. ప్రాణాలు దక్కించుకునే మార్గాల కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు. దేశం దాటలేకపోయిన సూడాన్ పౌరులు పరిస్థితి భవిష్యత్తులో దారుణంగా మారొచ్చని ఆఫ్రికా వ్యవహారాల నిపుణులు ఒకరు అంచనా వేశారు. విదేశీయుల తరలింపు పూర్తయ్యాక సైన్యం, పారామిలిటరీ దళాల ఘర్షణలు పతాకస్థాయికి చేరొచ్చని హెచ్చరించారు. కాల్పుల విరమణ, రాజీకి ఇరు వర్గాలు ఏమాత్రం అంగీకరించవని ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News