మ్యాంగో జ్యూస్ వెంటనే తీసుకురాలేదని కోడలిని ఇంటి నుంచి గెంటేశారు!

  • గుజరాత్ లోని నవరంగ్ పుర మహిళకు పాల్దీ ఏరియా వ్యక్తితో వివాహం
  • మ్యాంగో జ్యూస్ తీసుకురావాలని కోరిన అత్తగారు
  • టాయిలెట్ కు వెళ్లడంతో, ఆలస్యంగా జ్యూస్ తీసుకువచ్చిన కోడలు
  • కోడలిని ఇంటి నుంచి తోసేసిన అత్తగారు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కోడలు
కాపురానికి వచ్చిన మహిళలు భర్త, అత్తమామలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఎన్ని బాధలు పడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గుజరాత్ కు చెందిన 29 ఏళ్ల మహిళ పరిస్థితి కూడా అలాంటిదే. అడిగిన వెంటనే మ్యాంగో జ్యూస్ తీసుకురాలేదని ఆమెను భర్త, అత్తమామలు ఇంటి నుంచి గెంటేశారు. ఏడాది కిందట ఈ ఘటన జరిగింది. దీనిపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అహ్మదాబాద్ లోని పాల్దీ ఏరియాకు చెందిన వ్యక్తితో తన వివాహం గతేడాది జనవరి 23న జరిగిందని ఆమె వెల్లడించింది. పెళ్లయిన నాటినుంచి అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించేవారని, ఇంట్లో పనుల విషయంలోనూ తనను తిట్టేవారని ఆరోపించింది. 

గతేడాది మే 1న మ్యాంగో జ్యూస్ తీసుకురావాలంటూ అత్తగారు చెప్పారని, అయితే తాను టాయిలెట్ కి వెళ్లాల్సి రావడంతో మ్యాంగో జ్యూస్ చేయడం ఆలస్యమైందని ఆమె వివరించింది. అత్తగారు మాత్రం అదేమీ పట్టించుకోకుండా, మ్యాంగో జ్యూస్ ఎందుకు ఆలస్యంగా తీసుకువచ్చావంటూ మండిపడిందని, తనపై చేయి కూడా చేసుకుందని వివరించింది. అంతేకాదు, తనను ఇంటి నుంచి బయటికి తోసేసిందని, ఇంత జరుగుతున్నా తన భర్త, ఇతర కుటుంబ సభ్యులు ఒక్క మాట కూడా మాట్లాడలేదని వాపోయింది. 

ఆ తర్వాత వారితో సఖ్యంగా ఉండేందుకు తాను ప్రయత్నించినా, రాజీ పడేందుకు వారు ససేమిరా అన్నారని ఆ మహిళ తన ఫిర్యాదులో వెల్లడించింది. అంతేకాదు, కాపురం చేసే సమయంలో, అత్తగారి దాష్టీకం దారుణంగా ఉండేదని, ఆమె అనుమతి లేనిదే తాను వంట గదిలోకి వెళ్లలేకపోయేదాన్నని, ఆఖరికి భర్తతో మాట్లాడాలన్నా అత్తగారి అనుమతి ఉండాల్సిందేనని వివరించింది. 

నవంబరు 3న అత్తమామలు తనను విడాకుల పేరుతో బెదిరించారని వెల్లడించింది. గృహ హింస కింద కేసు నమోదు చేయాలంటూ పాల్దీ పోలీసులను కోరింది. అత్తమామలు, భర్త, ఇతర కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసింది.


More Telugu News