పేపర్ లీకేజి దొంగలు, బెయిల్ పై బయటికొచ్చినవాళ్లు నిన్న అమిత్ షా పక్కనున్నారు: హరీశ్ రావు వ్యంగ్యం

  • రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిన్న బీజేపీ సభ
  • అమిత్ షా ప్రసంగంపై హరీశ్ రావు విమర్శనాస్త్రాలు
  • అమిత్ షా మాటల్లో ఫ్రస్ట్రేషన్ కనిపించిందని వ్యాఖ్యలు
  • కర్ణాటకలో ఓటమి తప్పదని, తెలంగాణలో అధికారం దక్కదని అర్థమైందని వెల్లడి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీజేపీ విజయ సంకల్ప సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు బదులిచ్చారు. అమిత్ షా మాటల్లో అసహనం కనిపించిందని అన్నారు. కర్ణాటకలో ఓటమి తప్పదని, తెలంగాణలో అధికారం దక్కదని అర్థం కావడంతో అమిత్ షా ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడారని హరీశ్ విమర్శించారు. అమిత్ షా మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఎద్దేవా చేశారు. 

నిన్నటి సభలో అమిత్ షా పక్కన పేపర్ లీకేజి దొంగలు, బెయిల్ పై బయటికి వచ్చినవారు ఉన్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. ఖమ్మం జిల్లా కల్లూరులో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కాషాయదళంపై ధ్వజమెత్తారు. 

తెలంగాణలో అధికారంలోకి వస్తాం అని బీజేపీ వాళ్లు చెప్పుకుంటున్నారని, ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు గెలిచినా గొప్పేనని, వాళ్లకు డిపాజిట్ అయినా వస్తుందా అని వ్యాఖ్యానించారు. 

బీజేపీ పార్టీ గుజరాత్ పెద్దలకు గులాం చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలకు గులాం చేస్తుందని... కానీ, ప్రజలే అధిష్ఠానంగా పనిచేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని హరీశ్ రావు ఉద్ఘాటించారు.


More Telugu News