న్యూజిలాండ్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్ పైన 7.2 తీవ్రత

  • కెర్మాడెక్ దీవుల్లో సోమవారం ఉదయం కంపించిన భూమి
  • పది కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తింపు
  • సునామీ హెచ్చరికలు లేవని తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ
న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవుల్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ పేర్కొంది. ఏప్రిల్ 24, 2023న 6:11:52 గంటలకు 7.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని తెలిపింది. కెర్మాడెక్ దీవుల్లో పది కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించింది. 

కెర్మాడెక్ దీవుల్లో భూకంపం తర్వాత న్యూజిలాండ్ లో ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ భూకంపం వల్ల ప్రస్తుతానికి న్యూజిలాండ్ కు ఎలాంటి భారీ సునామీ అవకాశం లేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

మేఘాలయలో ప్రకంపనలు

భారత్ లోని మేఘాలయ వెస్ట్ ఖాసీ హిల్స్ లో సోమవారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఉదయం గం.7.45 సమయానికి రిక్టర్ స్కేల్ పైన 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. వెస్ట్ ఖాసీ హిల్స్ ప్రాంతంలో 5 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఆదివారం తెల్లవారు జామున మేఘాలయలోని సౌత్ గారో హిల్స్ లోను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 3.5 తీవ్రతగా నమోదయింది.


More Telugu News