ఏపీలో ఇవాళ కూడా పిడుగులు పడే అవకాశం.... ముప్పు ఉన్న జిల్లాలు ఇవే!

  • ఏపీలో నిన్న పిడుగుపాటుకు ఏడుగురి బలి
  • నేడు కూడా రాష్ట్రంలో అకాల వర్షాలు పడే అవకాశం
  • పిడుగుపాటు ముప్పు ఉన్న జిల్లాల జాబితా విడుదల 
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో అకాల వర్షాలు కురుస్తుండడం తెలిసిందే. అయితే, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఏపీలో నిన్న పిడుగులు పడి ఏడుగురు మృతి చెందారు. 

ఇవాళ కూడా రాష్ట్రంలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఇవాళ మన్యం, పల్నాడు, ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, కోనసీమ, విశాఖ, గుంటూరు, నంద్యాల, వైఎస్సార్ కడప, ఏలూరు, అనకాపల్లి, ఎన్టీఆర్, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరించింది. 

ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు చెట్ల కింద ఉండరాదని, పొలాల్లో ఉండే రైతులు, వ్యవసాయ కూలీలు, గొర్రెల కాపరులు, ఇతర పనివాళ్లు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ అంబేద్కర్ తెలిపారు.


More Telugu News