శ్రీవారి దర్శనానికి ఐఆర్ సీటీసీ స్పెషల్ ప్యాకేజ్ టూర్.. ధర రూ.4 వేల లోపే!

  • స్లీపర్ క్లాస్ ప్రయాణం, తిరుపతిలో హోటల్ వసతి
  • శ్రీవారి స్పెషల్ దర్శనంతో పాటు తిరుచానూరు అమ్మవారి దర్శనం కూడా..
  • రెండు రాత్రులు, మూడు రోజుల ప్రత్యేక టూర్
వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావించే భక్తులకు ఐఆర్ సీటీసీ శుభవార్త చెప్పింది. తక్కువ ఖర్చుతో శ్రీవారిని దర్శించుకునేందుకు స్పెషల్ ప్యాకేజీని తీసుకొచ్చినట్లు ప్రకటించింది. రెండు రాత్రులతో కలిపి మూడు రోజుల ఈ టూర్ ధరను రూ.4 వేల లోపే నిర్ణయించినట్లు పేర్కొంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి గోవిందం టూర్ పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని ఐఆర్ సీటీసీ తెలిపింది. ఈ స్పెషల్ టూర్ ప్రతీరోజూ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇందులో భాగంగా శ్రీవారి స్పెషల్ దర్శనంతో పాటు తిరుచానూరును కూడా సందర్శించవచ్చని అధికారులు తెలిపారు.

టూర్ సాగేదిలా..
గోవిందం టూర్ ప్యాకేజీ లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మొదలవుతుంది. సాయంత్రం 5:25 గంటలకు లింగంపల్లిలో ట్రైన్ నెంబర్ 12734 తో ప్రయాణం ప్రారంభించి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలో హోటల్ లో వసతి. స్నానాధికాలు పూర్తయ్యాక శ్రీవారి దర్శనానికి తిరుమలకు తీసుకెళతారు. ఉదయం 9 గంటలకు శ్రీవారి స్పెషల్ దర్శనం.. ఆపై తిరుపతికి తిరుగు ప్రయాణం. మధ్యాహ్న భోజనం తర్వాత పద్మావతి అమ్మవారి దర్శనం కోసం తిరుచానూర్ కు ప్రయాణం. అలివేలు మంగమ్మను దర్శించుకున్నాక తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకుని సాయంత్రం 6.25 గంటలకు 12733 నెంబర్ ట్రైన్ ఎక్కాలి. మరుసటి (మూడో) రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ చేరుకోవడంతో గోవిందం టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీలో అందించే సౌకర్యాలు:
తిరుపతిలో హోటల్ వసతి, బ్రేక్‌ఫాస్ట్, ఏసీ వాహనంలో ప్రయాణం, శ్రీవారి స్పెషల్ దర్శనం, బీమా సౌకర్యం

టికెట్ ధరలు..
  • స్టాండర్డ్ ప్యాకేజీ (స్లీపర్ క్లాస్ ప్రయాణం): సింగిల్ షేరింగ్ ధర రూ.4,950. డబుల్, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.3,800
  • కంఫర్ట్ ప్యాకేజీ (థర్డ్ ఏసీ ప్రయాణం): సింగిల్ షేరింగ్ ధర రూ.6,790. డబుల్, ట్రిపుల్ షేరింగ్ ధర రూ.5,660


More Telugu News