హమ్మయ్య.. భారీగా తగ్గిన కరోనా కేసులు!

  • గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,178 కేసులు
  • 65,683కు తగ్గిన యాక్టివ్ కేసులు
  • తాజాగా 9,011 మంది కోలుకున్నారన్న కేంద్ర ఆరోగ్య శాఖ
కరోనా కథ ముగిసిపోయిందనుకుంటే.. రెండు నెలలుగా కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు 10 వేల నుంచి 12 వేలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో మరో వేవ్ తప్పదా? అనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో కాస్త రిలీఫ్ వచ్చింది. కరోనా కేసులు భారీగా తగ్గాయి. 

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,178 కేసులు నమోదయ్యాయి. మరో 16 మంది (కేరళలో 8 పాత డెత్స్ కలిపారు) చనిపోయారు. ఆదివారం 10,112 కేసులు నమోదయ్యాయి. అంటే ఒక్కరోజులోనే 3 కేసులు తగ్గాయి. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 65,683కు తగ్గింది. తాజాగా 9,011 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ లో పేర్కొంది.

గత 5 వారాలుగా 80 నుంచి 110 శాతం వరకు కేసుల పెరుగుదల నమోదు కాగా.. గత వారం రోజుల్లో 20 శాతం పెరుగుదల మాత్రమే నమోదైందని వివరించింది. కొన్ని రోజులుగా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో.. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల వ్యాక్సిన్లు వేశారు.

ఒమిక్రాన్ సబ్-వేరియంట్ XBB.1.16 ఎఫెక్ట్ వల్లే కేసులు పెరుగుతున్నాయని, ఈ నెలాఖరు నుంచి క్రమంగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు ఇదే రీతిన కరోనా కేసులు నమోదవుతాయని, జనం ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.


More Telugu News