షర్మిలను పరామర్శించేందుకు వచ్చిన తల్లిని అడ్డుకున్న పోలీసులు.. వీళ్లకు చేతనైంది ఇదేనంటూ విజయమ్మ మండిపాటు

  • పోలీసులపై చేయి చేసుకున్న షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • జూబ్లీహిల్స్ పీఎస్ బయటే విజయమ్మను ఆపేసిన పోలీసులు
  • షర్మిలను అరెస్ట్ చేయడం, పీఎస్ కు తీసుకెళ్లడమే పోలీసులకు తెలుసన్న విజయమ్మ
విధుల్లో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ ను తోసేశారనే ఆరోపణలపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లోటస్ పాండ్ నుంచి జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో తన కూతురును పరామర్శించేందుకు పోలీస్ స్టేషన్ వద్దకు విజయమ్మ వచ్చారు. అయితే ఆమెను పోలీసులు స్టేషన్ లోపలకు అనుమతించలేదు. ఆమెను రోడ్డు పైనే ఆపేశారు. 

ఈ క్రమంలో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. తన కూతురును ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. తనను స్టేషన్ లోపలకు ఎందుకు అనుమతించడం లేదని నిలదీశారు. షర్మిలను అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం, షర్మిల గన్ మన్లను కొట్టడమే పోలీసులకు చేతనవుతుందని విజయమ్మ మండిపడ్డారు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్లు ఎందుకు లీక్ అయ్యాయని ప్రశ్నించేందుకు సిట్ కార్యాలయానికి వెళ్తున్న షర్మిలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. షర్మిలను కలిసేంత వరకు తాను ఇక్కడ నుంచి కదలనని చెప్పారు.


More Telugu News