ఆనంద్ మహీంద్రాకి ఈ స్టేడియం తెగ నచ్చేసింది..!

  • లఢఖ్ లో ఏర్పాటైన ఫుట్ బాల్ స్టేడియం
  • సముద్ర మట్టానికి 11వేల అడుగుల ఎత్తులో
  • ప్రపంచంలోని ఎత్తయిన స్టేడియాల్లో పదో స్థానం
  • ఒక ఆదివారం ఈ స్టేడియంలో వాలిపోతానన్న ఆనంద్ మహీంద్రా
ఐపీఎల్ సీజన్ 2023 మంచి రసవత్తరంగా సాగుతోంది. ప్రతి జట్టు గట్టి పోటీనిస్తోంది. దీంతో అభిమానులకు చివరి ఓవర్ దాకా ఉత్కంఠ తప్పడం లేదు. ఒకవైపు దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ నెలకొంటే.. మరోవైపు లఢఖ్ లో ఓ ఫుట్ బాల్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. ఈ ఫుట్ బాల్ స్టేడియం ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కంట్లో పడింది. ఆయన దీన్ని ఎంతగానో మెచ్చుకుంటూ, ఫొటోలను తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. 

మరి ఆనంద్ మహీంద్రా షేర్ చేశారంటే.. తప్పకుండా ఏదో ఒక విశేషం లేదా ప్రత్యేకత ఉంటుంది. ఈ ఫుట్ బాల్ స్టేడియానికి కూడా ప్రత్యేకత ఉందండి. సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తున ఈ స్టేడియం కొలువుదీరింది. దేశంలోనే ఎత్తయిన ఫుట్ బాల్ స్టేడియం ఇది. ప్రపంచంలో చూస్తే ఎత్తయిన ఫుట్ బాల్ మైదానాల్లో పదో స్థానంలో ఉంది. ‘‘ఈ దృశ్యం మీ ఊపిరిని దూరం చేస్తుంది. ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల కాదు. కూర్చుని పొటాటో చిప్స్ తింటూ క్రికెట్ చూడడానికి బదులు భవిష్యత్తులో ఏదో ఒక ఆదివారం ఈ స్టేడియంలో నేను మ్యాచ్ ను వీక్షించాలని అనుకుంటున్నాను’’ అని ఆనంద్ మహీంద్రా కోట్ చేశారు. ఇప్పటికే మూడు లక్షల మంది దీన్ని చూసేశారు.


More Telugu News