బుర్కినా ఫాసోలో దారుణం.. మిలటరీ యూనిఫాంలో గ్రామంలోకి చొరబడి 60 మంది కాల్చివేత

  • మాలి సరిహద్దు సమీప గ్రామంలో ఘటన
  • ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఇస్లామిస్ట్ సంస్థ ఆధిపత్యం
  • ఈ నెల 15న జరిగిన దాడిలో 40 మంది మృతి
  • 2012లో మాలిలో మొదలైన అశాంతి బుర్కినా ఫాసో, నైగెర్‌లకు పాకిన వైనం
  • ప్రాణాలు కోల్పోతున్న వేలాదిమంది
మిలటరీ యూనిఫాంలో ఉన్న కొందరు సాయుధులు ఓ గ్రామంలోకి చొరబడి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర బుర్కినా ఫాసోలో జరిగిందీ ఘటన. బుర్కినాబ్ ఆర్మీ యూనిఫాం ధరించిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు స్థానిక న్యాయవాది లమినే కబోర్ తెలిపారు. 

మాలి సరిహద్దుకు సమీపంలో ఉండే యెటెంగా ప్రావిన్స్‌లోని కర్మా గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు చెప్పారు. దీనికి సంబంధించి దర్యాప్తు ప్రారంభమైందని తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలో అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలున్న ఇస్లామిస్ట్ సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడ ఏళ్ల తరబడి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే, తాజా ఘటనకు సంబంధించి ఇంతకుమించిన వివరాలు తెలియరాలేదు.

ప్రభుత్వ భద్రతా దళాలు, స్వచ్ఛంద రక్షణ బృందాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నప్పటికీ సాయుధ దళాలు పౌరులపై దాడులకు తెగబడుతున్నాయి. 2022 తర్వాత ఇవి మరింత ఎక్కువైనట్టు మానవహక్కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 15న ఇదే ప్రాంతంలోని ఔహిగౌయాలో ఆర్మీ, స్వచ్ఛంద రక్షణ బృందాలపై సాయుధులు జరిపిన దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

టువరెగ్ వేర్పాటువాద తిరుగుబాటును ఇస్లామిస్టులు హైజాక్ చేయడంతో 2012లో మాలిలో అశాంతి మొదలైంది. ఆ తర్వాత ఈ హింస బుర్కినా ఫాసో, నైగెర్‌లకు పాకింది. అప్పటి నుంచి వేలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు 2.5 మిలియన్ల మంది ప్రజలు వలస వెళ్లిపోయారు.


More Telugu News