డ్రెస్సు మార్చి బరిలో దిగుతున్న ఆర్సీబీ... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్

  • నేడు ఐపీఎల్ లో డబుల్ హెడర్
  • తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఆర్సీబీ ఢీ
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
  • ఆర్సీబీ కెప్టెన్ గా మరోసారి కోహ్లీ
  • ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ గా డుప్లెసిస్
ఇవాళ ఆదివారం సందర్భంగా ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 

టాస్ సందర్భంగా, పర్యావరణ హిత కార్యక్రమంలో భాగంగా ఇరు జట్ల కెప్టెన్లకు ఓ మొక్కను అందించారు. చేతిలో కుండీలతో ఆర్బీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రాజస్థాన్ సారథి సంజు శాంసన్ దర్శనమిచ్చారు. ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని ఆర్సీబీ చేపడుతోంది. 

కాగా, నేటి మ్యాచ్ కోసం ఆర్సీబీ జట్టు తన రెగ్యులర్ రెడ్ అండ్ బ్లాక్  జెర్సీల్లో కాకుండా గ్రీన్ డ్రెస్సులతో బరిలో దిగుతోంది. గత ఐపీఎల్ సీజన్లలోనూ బెంగళూరు జట్టు అప్పుడప్పుడు గ్రీన్ డ్రెస్సులు ధరించి కొన్ని మ్యాచ్ లు ఆడింది.

నేటి మ్యాచ్ విషయానికొస్తే... బెంగళూరు జట్టులో సఫారీ పేసర్ వేన్ పార్నెల్ కు తుది జట్టులో స్థానం దక్కలేదు. అతడి స్థానంలో ఇంగ్లండ్ బౌలర్ డేవిడ్ విల్లీని తీసుకున్నట్టు కెప్టెన్ కోహ్లీ వెల్లడించాడు. రెగ్యులర్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ మరోసారి ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ గా ఆడనున్నాడు. 

అటు, రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ సంజు శాంసన్ తెలిపాడు. 

పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉండగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆరోస్థానంలో ఉంది. రాజస్థాన్ జట్టు ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి 4 విజయాలతో టాప్ లో నిలిచింది. ఆర్సీబీ 6 మ్యాచ్ ల్లో 3 విజయాలు సాధించింది.


More Telugu News