ఇంత వరస్ట్‌గానా... అప్పన్న ఆలయంలో భక్తులను చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి: స్వరూపానందేంద్ర

  • సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్లపై స్వామీజీ అసంతృప్తి
  • భక్తులకు సౌకర్యాలు లేవు కానీ గర్భాలయంలో పోలీసుల జులుం అని వ్యాఖ్య
  • ఇది చాలా దుర్మార్గమైన రోజుగా స్వరూపానందేంద్ర అసహనం
సింహాచలం అప్పన్న చందనోత్సవ ఏర్పాట్ల పైన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం అంత వరస్ట్ గా చందనోత్సవం ఎప్పుడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం గర్భాలయంలో పోలీసుల జులుం ఎక్కువైందన్నారు. 

భక్తులకు ఏ రకమైన సౌకర్యాలు లేవని, ప్రతి సంవత్సరం తమను అడిగేవారని, కానీ ఈ సంవత్సరం అధికారులు లేదా ఎవరు కూడా తమను అడగకుండానే చేశారని, ఇష్టారాజ్యంగా, పోలీసురాజ్యంగా అయిపోయిందన్నారు. సామాన్య భక్తులకు దేవుడిని దూరం చేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక్కడ ఆరు నెలలుగా ఈవో కూడా లేకుండా పోయారని, ఇంచార్జీతో నడిపిస్తున్నారన్నారు.

ఇంతపెద్ద క్షేత్రానికి ఒడిశా సహా వివిధ ప్రాంతాల నుండి భక్తుల తరలి వస్తారన్నారు. ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లు సరిగ్గా లేవన్నారు. వీఐపీ టిక్కెట్లు కూడా ఎవరికి అందాయో తెలియదన్నారు. భక్తుల మీద ఏమాత్రం కనికరం లేని విధంగా ఉందన్నారు. గర్భాలయం పరిస్థితులు చూస్తే భయం వేసేలా ఉందని వ్యాఖ్యానించారు.

గర్భాలయంలో మడి, ఆచారం, సంప్రదాయం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం గుంపులుగా ఉన్నారన్నారు. ఇది చాలా దుర్మార్గమైన రోజుగా చెప్పవచ్చునని వ్యాఖ్యానించారు. ఈ ఇబ్బందుల్లో భక్తులను చూస్తే కళ్లకు నీళ్లు వస్తున్నాయని, ఈ రోజు దర్శనానికి ఎందుకు వచ్చానా అనిపిస్తోందని స్వరూపానందేంద్ర తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

భక్తులకు సరైన దర్శనం కల్పించడం అంటే భగవంతుడిని దర్శించినట్లుగా భావించే వ్యక్తిని తాను అని, కానీ భక్తులకు అన్నీ ఇబ్బందులే అన్నారు. ఈయన పేదల దేవుడే తప్ప, ధనవంతులకు దేవుడు కాదని గుర్తించాలన్నారు. 

కొండ కింది నుండి పై వరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరన్నారు. తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యాన్ని చూడలేదన్నారు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవదర్శనం తనకు బాధ కలిగించినట్లు చెప్పారు.


More Telugu News