ఐపీఎల్ లో 250 సిక్సులు.. తొలి భారతీయ క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు

  • పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొట్టిన 3 సిక్సులతో రికార్డును అందుకున్న హిట్ మ్యాన్
  • 357 సిక్సర్లతో తొలి స్థానంలో క్రిస్ గేల్.. రెండో స్థానంలో డివిలియర్స్
  • మరో రెండు సిక్సులు కొడితే రెండో స్థానానికి రోహిత్
‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ.. పేరుకు తగ్గట్టుగానే మంచినీళ్ల ప్రాయంగా సిక్సులు బాదేస్తుంటాడు. ఆడేది టీమిండియాకైనా, ముంబై ఇండియన్స్ కైనా.. టెస్ట్ అయినా.. టీ20 అయినా.. ఆట తీరు మాత్రం మారదు. సిక్సర్ల వర్షం మాత్రం ఆగదు. ఆ జోరుతోనే ఈ ఐపీఎల్ లో ఓ రికార్డును రోహిత్ నెలకొల్పాడు.

నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కొట్టిన 3 సిక్సులతో.. ఐపీఎల్‌లో 250 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ క్రికెటర్‌గా హిట్ మ్యాన్ రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా చూస్తే.. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా వెస్టిండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ పేరిట రికార్డు ఉంది. 357 సిక్సర్లతో గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.

251 సిక్సులతో ఏబీ డివిలియర్స్ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో రోహిత్ ఉండగా.. నాలుగో స్థానంలో ధోనీ (235), ఐదో స్థానంలో విరాట్ కోహ్లీ (229) ఉన్నారు. రోహిత్ శర్మ మరో రెండు సిక్సర్లు కొడితే ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో డివిలియర్స్(251)ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంటాడు.

రోహిత్ ఫామ్ ను చూస్తే తర్వాతి మ్యాచ్‌లోనే రెండో ప్లేస్‌లోకి వెళ్లేలా కనిపిస్తున్నాడు. టీమిండియా తరఫున వన్డేల్లో 275 సిక్సర్లు కొట్టిన హిట్ మ్యాన్.. అంతర్జాతీయ టీ20ల్లో 182 సార్లు బంతిని స్టాండ్స్ లోకి పంపించాడు. టెస్టుల్లోనూ 69 సార్లు సిక్సర్లు బాదాడు.


More Telugu News