అర్షదీప్ దెబ్బకు ఒకే ఓవర్లో రెండుసార్లు విరిగిపోయిన స్టంప్స్.. వాటి ధర ఎంతంటే?

  • ముంబైతో మ్యాచ్ లో చివరి ఓవర్లో రెండు వికెట్లు తీసిన అర్షదీప్
  • యార్కర్ల దెబ్బకు వరుసగా రెండు సార్లు విరిగిపోయిన మిడిల్ స్టంప్స్
  • ఒక్కో ఎల్ఈడీ స్టంప్ రూ.24 లక్షల పైమాటే
ఐపీఎల్ లో నిన్న జరిగిన రెండు మ్యాచ్ లు అభిమానులకు కావాల్సినంత మజాను ఇచ్చాయి. చివరి ఓవర్ దాకా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లలో బౌలర్లు అద్భుతాలు చేశారు. తొలుత గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ.. లక్నోను బోల్తా కొట్టించాడు. తర్వాత పంజాబ్ ప్లేయర్ అర్షదీప్ సింగ్.. పటిష్ఠ ముంబైని మట్టికరిపించాడు.

ముంబైతో మ్యాచ్ లో మొత్తం నాలుగు వికెట్లు తీసిన అర్షదీప్ సింగ్.. చివరి ఓవర్ లోనే రెండు వికెట్లు తీశాడు. పైగా అదిరిపోయే యార్కర్లతో వరుసగా రెండు బంతుల్లో రెండు సార్లు మిడిల్ స్టంప్ ను విరక్కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

మరోవైపు అర్షదీప్ విరక్కొట్టిన స్టంప్స్ విలువపైనా జోరుగానే చర్చ జరుగుతోంది. ఎందుకంటే వాటి విలువ అలాంటిది మరి. అవేమీ ఆషామాషీ స్టంప్స్ కాదు. ఎల్ఈడీ లైట్లు, కెమెరాలు అమర్చి ప్రత్యేకంగా తయారు చేసినవి. 
 
ఎల్ఈడీ లైట్లు, కెమెరా, జింగ్ బెయిల్స్ తో కూడిన సెట్ విలువ.. బ్రాండ్, డిజైన్, ఫీజర్లను బట్టి మారుతుంటుంది. హైఎండ్ సెట్ విలువ కొన్ని వేల డాలర్ల దాకా ఉంటుంది. ఇక అర్షదీప్ విరగ్గొట్టిన ఒక్కో స్టంప్ విలువ సుమారు రూ.24 లక్షల నుంచి రూ.30 లక్షల దాకా ఉంటుందట.

ఒక స్టంప్ దెబ్బతిన్నా.. సెట్ మొత్తాన్ని మార్చాల్సిందే. అర్షదీప్ ఒకే ఓవర్లో రెండు స్టంప్‌లను విరగొట్టడంతో.. రెండుసార్లు స్టంప్స్‌ను మార్చాల్సి వచ్చింది. అంటే రెండు స్టంప్స్ విరిగిపోవడం వల్ల సుమారుగా రూ.50 లక్షల నుంచి 60 లక్షల దాకా నష్టం.


More Telugu News