ముసలితనంలో జుట్టు తెల్లబడేది ఇందుకే!

  • ఎలుకలపై రెండేళ్ల పాటు శాస్త్రవేత్తల పరిశోధన
  • మెలనోసైట్ కణాల్లో మార్పులతో జుట్టు తెల్లబడుతోందని వెల్లడి
  • మనుషుల్లోనూ ఇదే జరుగుతూ ఉండొచ్చని వ్యాఖ్య
  • ఈ పరిశోధనతో కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తాయన్న శాస్త్రవేత్తలు

ముసలితనం వచ్చిందనడానికి తొలి సంకేతం తెల్ల జుట్టే! అందుకే జుట్టు తెల్లబడుతోందంటే మనకు అంత భయం. అయితే, ఈ మార్పు‌లు ఎలా జరుగుతున్నాయో శాస్త్రవేత్తలు తాజాగా కనుక్కున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను నేచర్ అనే జర్నల్‌లో తాజాగా ప్రచురించారు.

ఎలుకలపై రెండేళ్ల పాటు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు జుట్టు మొదళ్లలో ఉండే హెయిర్ ఫాలికల్స్‌లో(కణాల సముదాయం) వచ్చే మార్పులను గమనించారు. హెయిర్ ఫాలికల్‌‌లోని మెలనోసైట్ స్టెమ్ సెల్స్(ప్రాథమిక కణాలు) జుట్టు రంగుకు కారణమని శాస్త్ర ప్రపంచానికి ఎప్పటి నుంచో తెలుసు. అయితే, ఎలుకలు యువ్వనంలో ఉన్నప్పుడు మెలనోసైట్స్ హెయిర్ ఫాలికల్ అంతటా తిరుగుతూ అభివృద్ధి చెందాయని, నల్ల రంగుకు కారణమయ్యే మెలనిన్‌ను ఉత్పత్తి చేశాయని తెలిపారు. ముసలివయసులో మాత్రం మెలనోసైట్స్ ఒక చోట పోగుబడిపోయాయని, చివరకు మెలనిన్ ఉత్పత్తిని నిలిపివేశాయని వెల్లడించారు. 

మనుషుల్లోనూ దాదాపు ఇదే ప్రక్రియ ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అంశంపై మరిన్ని పరిశోధనలు జరిగితే తెల్ల జుట్టు సమస్యకు కొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.


More Telugu News