ప్రముఖ భాషా శాస్త్రవేత్త, వ్యాకరణ సార్వభౌముడు రవ్వా శ్రీహరి కన్నుమూత

  • గుండెపోటుతో కన్నుమూసిన శ్రీహరి
  • ఎన్నో నిఘంటువులకు రూపకల్పన
  • వ్యాకరణ సార్వభౌముడిగా పురస్కారం
  • కేంద్ర సాహిత్య అకాడమీ సహా మరెన్నో పురస్కారాలు అందుకున్న భాషా శాస్త్రవేత్త
ప్రముఖ భాషా శాస్త్రవేత్త, వ్యాకరణ సార్వభౌముడు, నిఘంటు నిర్మాత ఆచార్య రవ్వా శ్రీహరి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. హైదరాబాద్ మలక్‌పేటలో నివసిస్తున్న ఆయన శుక్రవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఆయనకు భార్య అనంతలక్ష్మి, కుమారులు రమేశ్, శివకుమార్, పతంజలి ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన వీరు తండ్రి మరణ వార్తతో హైదరాబాద్ బయలుదేరారు.

శ్రీహరి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా వలిగొండంలోని వెల్వర్తి. చేనేత కుటుంబంలో పుట్టిన ఆయన ఐదో తరగతితోనే చదువు ఆపేసి కులవృత్తిని చేపట్టారు. ఓ రోజు శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి సంస్కృత విద్యాపీఠం విడుదల చేసిన ప్రకటన చూసి విద్యాపీఠంలో చేరారు. ఆ తర్వాత సీతారాంబాగ్‌ సంస్కృత కళాశాలలో డీవోఎల్‌, బీవోఎల్‌ వ్యాకరణం అభ్యసించి  తర్క, వ్యాకరణ, విశిష్ట అద్వైత, వేదాంత శాస్త్రాల్లో ప్రావీణ్యం సంపాదించారు.

పతంజలి ‘మహా భాష్యాంతర’ వ్యాకరణాన్ని నేర్చుకున్నారు. తెలుగు పండిట్ కోర్సు, బీఏ, ఎంఏ కూడా పూర్తిచేశారు. ‘భాస్కర రామాయణం’పై పరిశోధన చేసి ఓయూ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత అధ్యాపకుడిగా పనిచేశారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడిగా, తెలుగు శాఖ అధ్యక్షుడిగా, డీన్‌గా 17ఏళ్లు సేవలందించారు. ‘శ్రీహరి నిఘంటువు’, ‘అన్నమయ్య పదకోశం’, ‘సంకేత పదకోశం’, ‘నల్గొండ జిల్లా మాండలిక పదకోశం’, ‘వ్యాకరణ పదకోశం’ వంటి నిఘంటువులతోపాటు మరెన్నో రచనలు చేశారు. నిఘంటువుల్లో లేని పదాలు కనుగొని, కొత్త పదాలతో నిఘంటువు రాసిన ఆయన బంగారు పతకం సాధించి వ్యాకరణ సార్వభౌముడిగా పురస్కారం అందుకున్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సహా మరెన్నో పురస్కారాలు అందుకున్నారు.   



More Telugu News