టైటాన్స్.. ముందు బ్యాటింగ్ తీసుకుంది ఇందుకా?

  • లక్నోలో సూపర్ జెయింట్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టైటాన్స్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు
  • హార్దిక్ పాండ్యా 66, సాహా 47 పరుగులు చేసిన వైనం
  • చెరో రెండు వికెట్లు పడగొట్టిన కృనాల్ పాండ్యా, స్టొయినిస్
ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ నేడు లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ ఆడుతోంది. అయితే టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, చేసిందేమీ లేదు. భారీ స్కోరు సాధించలేక చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 66 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. పాండ్యా 50 బంతులాడి 2 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. అంతకుముందు, ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 37 బంతుల్లో 6 ఫోర్లతో 47 పరుగులు చేశాడు. 

యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ డకౌట్ కావడం గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ పై ప్రభావం చూపింది. అభినవ్ మనోహర్ 3, ఆల్ రౌండర్ విజయ్ శంకర్ 10, డేవిడ్ మిల్లర్ 6 పరుగులకే అవుటయ్యారు. దాంతో టైటాన్స్ స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో కృనాల్ పాండ్యా 2, మార్కస్ స్టొయినిస్ 2, నవీనుల్ హక్ 1, అమిత్ మిశ్రా 1 వికెట్ తీశారు.


More Telugu News