ముఖ్యమంత్రి పదవి కోసం 2024 వరకు ఎందుకు వేచి చూడాలి?: ఎన్సీపీ నేత అజిత్ పవార్

  • వంద శాతం ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నానని కుండబద్దలు కొట్టిన పవార్
  • అప్పుడు మాకే సీఎం పదవి అనుకున్నారు.. కానీ ఢిల్లీలో డిసైడ్ అయిందన్న ఎన్సీపీ నేత
  • ఆయన అర్హుడే.. శుభాకాంక్షలు చెప్పిన సంజయ్ రౌత్
ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్సీపీ 2024 వరకు ఎందుకు వేచి చూడాలని, ఇప్పుడు కూడా ఈ పదవిని పొందడానికి సిద్ధంగా ఉన్నామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత అజిత్ పవార్ షాకింగ్ కామెంట్లు చేశారు. అజిత్ తన మద్దతుదారులతో బీజేపీలో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. బీజేపీతో కలవడంపై అజిత్ పవార్ తో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా కొట్టి పారేశారు. అయినప్పటికీ ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇలాంటి సమయంలో అజిత్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి తోడు పార్టీ సమావేశానికి గైర్హాజరయ్యారు.

ముఖ్యమంత్రి పదవిపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా అజిత్ స్పందించారు. మీరు సీఎం కావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా... వంద శాతం అనుకుంటున్నానని సమాధానం చెప్పారు. 2004లో ఎన్సీపీ, కాంగ్రెస్ కలిశాయని, తమ పార్టీ 71, కాంగ్రెస్ 69 సీట్లు గెలుచుకున్నాయని, అప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమదే ముఖ్యమంత్రి పదవి అనుకున్నారని గుర్తు చేశారు. కానీ పదవులపై ఢిల్లీలో నిర్ణయం తీసుకొని, కాంగ్రెస్ సీఎం పదవి తీసుకొని, తమకు ఉప ముఖ్యమంత్రిని ఇచ్చిందని చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవడంతో ఆ పార్టీ నేతనే ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు.

ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో సీఎం పదవి కోసం పోటీ పడతారా అని ప్రశ్నించగా..  2024 వరకు వేచి చూడటం ఎందుకని, ఇప్పుడు కూడా ఆ పదవి పొందడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కాగా, అజిత్ పవార్ సీఎం కోరికపై ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. అజిత్ చాలా ఏళ్లుగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారని, సీఎం పదవికి ఆయన అర్హుడని చెప్పారు.

'సీఎం కావడానికి ఎవరు ఆసక్తి చూపించరు?... పవార్ సీఎం కావడానికి సమర్థుడు. చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు. మంత్రిగా పని చేశాడు. అత్యధికసార్లు డిప్యూటీ సీఎంగా ఉన్న చరిత్ర ఉంది. ఎవరైనా సీఎం కావాలనుకోవడం సహజం' అని వ్యాఖ్యానించారు. అతను తన కోరికను మొదటిసారి మాత్రమే వ్యక్తం చేయడం లేదని, అతనికి నా శుభాకాంక్షలు అన్నారు.


More Telugu News