కట్టప్ప పాత్రను ఎందుకు వదులుకున్నాడో చెప్పిన ‘మున్నాభాయ్’!

  • బాహుబలిలో కట్టప్ప పాత్ర కోసం తొలుత సంజయ్ దత్ ను సంప్రదించిన రాజమౌళి
  • పాత్ర బలంగా లేదని అవకాశాన్ని వదులుకున్నానన్న సంజయ్
  • కట్టప్పగా అదరగొట్టిన సత్యరాజ్‌.. ఆయనకు మైల్ స్టోన్ గా నిలిచిన క్యారెక్టర్
బాహుబలి.. తెలుగు సినీ ఖ్యాతిని దేశ నలుమూలలకూ విస్తరింపజేసింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుని, తిరుగులేని రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో అతి కీలకమైన పాత్రలు ఐదు. బాహుబలి, భల్లాల దేవుడు, శివగామి, దేవసేన, కట్టప్ప.

సినిమాను మలుపు తిప్పేది, రెండో భాగం కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన పాత్ర ‘కట్టప్ప’. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు’ అనే ప్రశ్న అప్పట్లో మారుమోగింది. కట్టప్ప పాత్రను తమిళ నటుడు సత్యరాజ్ పోషించారు. గుర్తుండిపోయేలా నటించి మెప్పించారు.

ఇంతటి కీలక పాత్రను బాలీవుడ్ ‘మున్నాభాయ్’ సంజయ్ దత్ వదులుకున్నారట. కట్టప్ప క్యారెక్టర్‌ కోసం మొదట సంజయ్‌ దత్‌ను సంప్రదించారట దర్శకుడు రాజమౌళి. అయితే స్క్రిప్ట్‌ విన్న సంజయ్‌ దత్‌.. కట్టప్ప పాత్ర అంత బలంగా లేదని భావించి అవకాశాన్ని వదులుకున్నారట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంజయ్‌ దత్‌ వెల్లడించారు. 

సంజయ్ దత్ వదులుకోవడంతో అటు తిరిగి.. ఇటు తిరిగి ఆ పాత్ర సత్యరాజ్‌కు దక్కింది. సత్యరాజ్‌ కెరీర్‌లోనే ఒక మైల్‌స్టోన్‌గా నిలిచింది. ప్రతి బియ్యపు గింజపై తినే వారి పేరు రాసి ఉంటుందట. అలానే ప్రతి పాత్ర ఎవరికి దక్కాలో చివరికి వారికే దక్కుతుంది. కట్టప్ప క్యారెక్టర్ మిస్ అయినా.. ‘కేజీఎఫ్‌’ రెండో పార్ట్ లో అధీరా పాత్రను సంజయ్ మిస్ చేసుకోలేదు. అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రశంసలు పొందారు మున్నాభాయ్.


More Telugu News