చంద్రబాబు ప్రాణాలకు ముప్పు: ప్రధానికి రఘురామ లేఖ

  • ఏపీలో రాజకీయం హద్దులు మీరుతోందని మోదీకి ఎంపీ ఫిర్యాదు
  • మంత్రి సురేష్ ముందే రెచ్చగొట్టే ప్రకటన చేశారని వ్యాఖ్య
  • బ్లాక్ డే అంటూ ట్విట్టర్ రచ్చబండ ద్వారా ప్రభుత్వంపై నిప్పులు
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై యర్రగొండపాలెంలో జరిగిన రాళ్ల దాడి ఘటన పైన వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణంరాజు స్పందించారు. ప్రతిపక్ష నేత ప్రాణాలకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం హద్దులు మీరుతోందని, ఇక్కడ ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను దారుణంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. నిన్న యర్రగొండపాలెంలో చంద్రబాబు ర్యాలీ సందర్భంగా ఆయన వాహనం పైన రాళ్ల దాడి జరిగిందని చెబుతూ... రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు.

ఎన్ఎస్‌జీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుగా పెట్టి చంద్రబాబుకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతిపక్ష నేతకు రక్షణగా నిలిచే క్రమంలో ఓ కమాండెంట్ సంతోష్ కు గాయాలు అయినట్లు తెలిపారు. చంద్రబాబును ఇక్కడకు వస్తే అడ్డుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ ముందే రెచ్చగొట్టేలా ప్రకటన చేశారన్నారు. మంత్రి ముందే తన చొక్కాను చించేసుకొని, వీధి పోరాటం చేశారని విమర్శించారు.

ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వారంతా చంద్రబాబుపై జరిగిన దాడిని ఖండించాలని రఘురామ పిలుపునిచ్చారు. ఈ దాడిని నిరసిస్తూ ఆయన తన ట్విట్టర్ రచ్చబండ ప్రోగ్రాంకు నల్లచొక్కా ధరించి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అసలు ఏపీలో నాలుగేళ్లుగా ప్రతి దినం చీకటి దినంగానే తయారయిందన్నారు.

రాక్షసులను అంతమొందించేందుకు విష్ణుమూర్తి, శివుడు చాలాసార్లు కలిశారని గుర్తు చేశారు. అలాగే ఏపీలోను బ్రహ్మ, శివుడు, విష్ణుమూర్తి కలుస్తారా చూద్దాం అన్నారు. లేకపోతే కేవలం విష్ణు, శివుడు మాత్రమే కలుస్తారా చూడాలన్నారు. వీరిద్దరు కలవడం సహజమేనని, కానీ బ్రహ్మ మాత్రం నేను కూడా మహేశ్వరుడినే అంటున్నారని, కాబట్టి బ్రహ్మ నేరుగా కాకుండా మహేశ్వరుడి ద్వారా కూడా రావొచ్చునని వ్యాఖ్యానించారు. తాను విష్ణుమూర్తిగా టీడీపీని, శివుడిగా పవన్ కళ్యాణ్ ను అనుకుంటున్నానని, సృష్టికి మూలమైన బ్రహ్మగా కమలం అంటే కేంద్రంలోని బీజేపీగా భావిస్తున్నట్లు చెప్పారు. తన లెక్క ప్రకారం ఈ ముగ్గురు కలుస్తారనుకుంటున్నట్లు చెప్పారు.


More Telugu News