దాడి చేసింది మేం కాదు... ప్రమాణం చేయడానికి సిద్ధం: మంత్రి ఆదిమూలపు సురేశ్

  • యర్రగొండపాలెంలో నిన్న ఉద్రిక్త పరిస్థితులు
  • చంద్రబాబు వాహనంపై రాళ్ల దాడి
  • నిరసనలకు నేతృత్వం వహించిన మంత్రి ఆదిమూలపు సురేశ్
  • రాళ్ల దాడిలో చంద్రబాబు భద్రతాధికారికి గాయాలు
  • టీడీపీ రాళ్ల దాడిలోనే ఆ అధికారికి గాయాలు అయ్యాయన్న మంత్రి
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో నిన్న సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు వాహనంపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు మంత్రి ఆదిమూలపు సురేశ్ వైపు వేలెత్తి చూపుతున్నారు. అయితే ఈ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ అంటున్నారు. 

దాడి చేసింది తాము కాదని, తామే తప్పు చేయలేదని ప్రమాణం చేసేందుకైనా సిద్ధమని ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. టీడీపీ శ్రేణులు విసిరిన రాళ్ల వల్లే ఎన్ఎస్ జీ అధికారికి గాయాలు తగిలాయని ఆరోపించారు.  టీడీపీ నేతలు ముందుకు రావాలని, కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేద్దామని అన్నారు. 

చంద్రబాబు దళితులను రెచ్చగొట్టేలా వేలు చూపి బెదిరించారని... చుండూరు, కారంచేడు వంటి మరో మారణహోమం సృష్టించేందుకు ప్రయత్నించారని ఆదిమూలపు సురేశ్ ఆరోపించారు. దళితుల పట్ల చంద్రబాబు వైఖరిలో మార్పేమీ లేదన్న ఈ విషయం ఈ ఘటనతో తేటతెల్లమైందని అన్నారు. పక్కా ప్లాన్ తోనే అల్లరి మూకలతో దాడులకు ప్రయత్నించారని, వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని వివరించారు. 

దళితులు ఏం పీకుతారు అని లోకేశ్ అసభ్య పదజాలంతో దూషించాడని, దళితులకు క్షమాపణలు చెప్పాలి అని మేం డిమాండ్ చేయడం తప్పా? అని ఆదిమూలపు సురేశ్ ప్రశ్నించారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడబోమని, తనను తగులబెట్టినా వెనుకంజ వేసేది లేదని స్పష్టం చేశారు.

ఎన్ఎస్ జీ అధికారికి క్షమాపణ చెప్పిన చంద్రబాబు

యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ల దాడి జరగ్గా... సంతోష్ కుమార్ అనే ఎస్ఎన్ జీ కమాండెంట్ కు గాయాలయ్యాయి. ఆయన తలకు దెబ్బ తగలగా, 3 కుట్లు పడ్డాయి. దీనిపై చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తనకు భద్రత కల్పించేందుకు వచ్చిన అధికారి గాయపడడం పట్ల బాధపడ్డారు. ఆ ఎన్ఎస్ జీ కమాండెంట్ కు చంద్రబాబు సారీ చెప్పారు. అందుకు ఆ అధికారి స్పందిస్తూ... అది మా డ్యూటీ సార్... ఫర్వాలేదండీ అంటూ బదులిచ్చారు. 

మంత్రి ఆదిమూలపు వీడియో పంచుకున్న టీడీపీ

యర్రగొండపాలెంలో చంద్రబాబు రాకను నిరసిస్తూ మంత్రి ఆదిమూలపు సురేశ్ నేతృత్వంలో నల్లచొక్కాలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టడం తెలిసిందే. ఈ ప్రదర్శన నేపథ్యంలో, మంత్రి పోలీసులకు దిశానిర్దేశం చేశారంటూ టీడీపీ ఓ వీడియోను పంచుకుంది. మంత్రి ముందస్తు ప్రణాళికతోనే రంగంలోకి దిగారని టీడీపీ ఆరోపిస్తోంది.


More Telugu News