టాలీవుడ్ పై దృష్టి పెట్టిన మరో కోలీవుడ్ స్టార్!
- కోలీవుడ్ స్టార్ హీరోగా జయం రవి
- 'పొన్నియిన్ సెల్వన్ 1'తో ఇక్కడ గుర్తింపు
- నేరుగా తెలుగు సినిమా చేసే ఆలోచన
- ఆ దిశగా జరుగుతున్న సన్నాహాలు
జయం రవి .. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు. మంచి హైటూ .. అందుకు తగిన ఫిజిక్ ఆయన సొంతం. తను ఎడిటర్ మోహన్ కి తనయుడు .. చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాకి దర్శకుడైన మోహన్ రాజాకి సోదరుడు. జయం రవి బాలనటుడిగా 'బావ బావమరిది'.. 'పల్నాటి పౌరుషం' సినిమాల్లో నటించాడనే విషయం చాలామందికి తెలియదు. తెలుగులో నితిన్ హీరోగా చేసిన 'జయం' సినిమా, అదే టైటిల్ తో తమిళంలో రీమేక్ అయింది. ఆ రీమేక్ తోనే రవి అక్కడ హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. అప్పటి నుంచి హీరోగా ఆయన తన ప్రత్యేకతను చాటుతూ వెళుతున్నాడు. ఆయన సినిమాలు అనువాదాలుగా ఇక్కడికి వచ్చినవి చాలా తక్కువ. అందువలన ఇక్కడి ప్రేక్షకులకు ఆయన అంతగా కనెక్ట్ కాలేదు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియిన్ సెల్వన్ 1' సినిమాలో విక్రమ్ .. కార్తి పాత్రల డామినేషన్ ఎక్కువగా కనిపించినప్పటికీ, టైటిల్ రోల్ ను పోషించింది జయం రవినే. ఈ సినిమాతోనే ఇక్కడ ఆయన ఎక్కువమందికి తెలిశాడు. పార్టు 2తో ఇక్కడి ప్రేక్షకులకు ఆయన మరింత చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మిగతా కోలీవుడ్ స్టార్స్ మాదిరిగానే, తెలుగులోనేరుగా సినిమాలు చేయడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. కథను మోహన్ రాజా సెట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాస్త ఆలస్యమైనా జయం రవి కన్ను కూడా టాలీవుడ్ పై పడిందన్న మాట.