అక్షయ తృతీయ సందర్భంగా విత్తన దుకాణాల ముందు ఆదిలాబాద్ రైతుల క్యూ

  • బంగారంలాంటి పంట పండుతుందనే నమ్మకమే కారణం
  • ఉదయం నుంచే క్యూ కట్టిన ఆదిలాబాద్ రైతులు
  • వానాకాలం సాగుకు రెండు నెలల ముందే విత్తనాల కొనుగోలు
అక్షయ తృతీయ రోజు బంగారం దుకాణాలకు జనం పోటెత్తుతుంటే ఆదిలాబాద్ రైతులు మాత్రం విత్తనాల షాపుల ముందు క్యూ కట్టారు. ఉదయం నుంచే సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాపుల ముందు బారులు తీరారు. అక్షయ తృతీయ రోజు విత్తనాలు కొంటే బంగారం లాంటి పంట పండుతుందన్న నమ్మకమే దీనికి కారణమని చెబుతున్నారు. వానాకాలం సాగుకు ఇంకా రెండు నెలలు సమయం ఉంది.. అయినా ఇప్పుడే విత్తనాలు కొని పెట్టుకుంటున్నారు. మంచిరోజు కావడంతో అక్షయ తృతీయ సందర్భంగా ఇష్టదైవానికి పూజలు చేసి వానాకాలం సాగు పనులు ప్రారంభిస్తామని రైతులు చెబుతున్నారు.

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా రైతులు పత్తి, సోయ ఎక్కువగా సాగు చేస్తుంటారు. శనివారం అక్షయ తృతీయ కావడంతో పత్తి, సోయ విత్తనాలు కొనుగోలు చేసేందుకు జిల్లాలోని సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణాల ముందు రైతులు బారులుతీరారు. అక్షయ తృతీయ రోజు చాలామంది బంగారం కొంటే.. తాము మాత్రం బంగారంలాంటి పంట పండాలని విత్తనాలు కొనుగోలు చేస్తామని రైతులు అంటున్నారు. వ్యాపారులు కూడా అన్నదాతలను అతిథులుగా భావించి శాలువా కప్పి గౌరవించి, విత్తనాలను వారికి అందజేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలాకాలంగా ఇది ఆనవాయతీగా కొనసాగుతోందని చెప్పారు.


More Telugu News