కరోనా ఇంకా ముగియలేదు... అప్రమత్తంగా ఉండండి: 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ

  • దేశంలో, ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు
  • మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ సహా 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ
  • అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు
  • అవసరమైతే రాష్ట్రం ఆంక్షలు అమలు చేయవచ్చునని సూచన
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సహా ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కరోనా ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతోంది. మన దేశంలో ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య 11,000 క్రాస్ చేసింది. యాక్టివ్ కేసుల సంఖ్య 66వేలు దాటాయి. అప్రమత్తమైన కేంద్రం అప్రమత్తంగా వ్యవహరించాలని ఎనిమిది రాష్ట్రాలకు లేఖ రాసింది. కోవిడ్ ఇంకా ముగియలేదని చెబుతూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీలకు హెచ్చరిక లేఖలు రాశారు.

కరోనా పెరుగుతున్న దృష్ట్యా అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని అందులో పేర్కొన్నారు. మార్చి నుండి దేశంలో కోవిడ్ -19 కేసులు స్థిరంగా పెరుగుతున్నాయని, ఏప్రిల్ 20తో ముగిసిన వారంలో 10,262 కేసులు నమోదయ్యాయని, పాజిటివిటీ రేటు కూడా అంతటా పెరిగిందని పేర్కొన్నారు. ఏప్రిల్ 19తో ముగిసిన వారంలో దేశంలో 5.5 శాతం పాజిటివిటీ రేటు నమోదైందని, అంతకుముందు వారంలో 4.7 శాతం పాజిటివిటీ రేటు నమోదైందని తెలిపారు. ఇది ఆందోళన కలిగించే అంశమే అన్నారు.

కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరడం, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడం స్థానికంగా వైరస్ వ్యాప్తిని సూచిస్తోందని భూషణ్ పేర్కొన్నారు. మహమ్మారిని ప్రారంభ దశలోనే నియంత్రించే చర్యలు చేపట్టాలన్నారు. పరిస్థితి యొక్క కచ్చితమైన పర్యవేక్షణలో సహాయం చేయడానికి డేటాను సకాలంలో, క్రమం తప్పకుండా నవీకరించడం కూడా చాలా కీలకమని సూచించారు. ఏదైనా ప్రాంతంలో నియంత్రణ అవసరమైతే రాష్ట్రం కఠినమైన పర్యవేక్షణను నిర్వహించడం, ముందస్తు చర్య తీసుకోవడం చాలా అవసరమని సూచించారు.


More Telugu News