ఉగ్రదాడి ఘటనతో కేంద్ర పారా మిటలరీ దళాలకు హోం శాఖ కీలక ఆదేశాలు

  • కదలికల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన
  • జమ్మూ కశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటన
  • దాడి జరిగిన సమీప ప్రాంతాలను జల్లెడ పడుతున్న బలగాలు
జమ్మూకశ్మీరులోని పూంచ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి ఘటనతో ఆ రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించారు. కేంద్ర పారా మిలటరీ బలగాలు తమ కదలికల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులతో పాటు, దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌, ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి సెక్టార్లలో కూడా ఉగ్రవాదులు పాక్ వైపు నుంచి తిరిగి చొరబడకుండా హై అలర్ట్ ప్రకటించింది. ఐదుగురు జవాన్లు అమరులైన ఉగ్రదాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. ఫూంచ్  జిల్లాలోని భీంబెర్ గాలి నుంచి సంగియోట్ వెళ్తున్న ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు గ్రెనేడ్లతో తెగబడ్డారు. 

ఈ దాడి అనంతరం భారత భద్రతా దళాలు మెంధార్ సబ్-డివిజన్‌లోని వివిధ గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. భింబర్ గలి, భాటా ధురియన్ మధ్య జాతీయ రహదారిపై అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భటా ధురియన్‌లో జరిగిన సంఘటన నేపథ్యంలో భింబర్ గలి నుండి సురన్‌కోట్ రోడ్డు వరకు ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్లు పూంచ్ జిల్లాలోని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. భారీగా బలగాలను మోహరించి భాటా ధురియన్, నార్ ఫారెస్ట్, సంజియోట్, కోటన్‌తో సహా పలు గ్రామాలను చుట్టుముట్టాయి. సాయుధ పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు.


More Telugu News