హతవిధీ! పొరపాటున సొంత నగరంపైనే బాంబుల వర్షం కురిపించిన రష్యా యుద్ధ విమానం

  • ఉక్రెయిన్‌పై ఏడాదికిపైగా యుద్ధం చేస్తున్న రష్యా
  • సొంత నగరమైన బెల్‌గార్డ్‌పై పొరపాటున బాంబులు ప్రయోగించిన సుఖోయ్ యుద్ధ విమానం
  • దెబ్బతిన్న పలు భవనాలు.. ఇద్దరు మహిళలకు గాయాలు
  • దర్యాప్తునకు ఆదేశం
ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడి ఏడాదికి పైగా యుద్ధం చేస్తున్న రష్యా శత్రుదేశ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా యుద్ధ విమానాల దాడిలో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ కూడా రష్యాకు దీటుగా బదులిస్తోంది. తాజాగా, రష్యా యుద్ధం విమానం ఒకటి పొరపాటున సొంత నగరంపైనే బాంబుల వర్షం కురిపించింది. ఫలితంగా భారీ పేలుళ్లు సంభవించాయి. పలు భవనాలు దెబ్బతిన్నాయి. 

రక్షణ మంత్రిత్వశాఖను ఉటంకిస్తూ ఈ విషయాన్ని ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ ‘టాస్’ వెల్లడించింది. యుద్ధ విమానం బాంబులు ప్రయోగించడంతో ఓ నగరంలోని ప్రధాన వీధిలో 20 మీటర్ల మేర పెద్ద గొయ్యి ఏర్పడినట్టు బెల్‌గార్డ్ ప్రాంతీయ గవర్నర్ వ్యాషెస్లావ్ గ్లాడ్కోవ్ తెలిపారు. అంతేకాదు, రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. 

ఉక్రెయిన్‌ సరిహద్దులోని బెల్‌గార్డ్ నగరంపై ఎగురుతున్న సమయంలో సుఖోయ్ ఎస్-4 యుద్ధ విమానం ప్రమాదవశాత్తు పేలుడు పదార్థాలను జారవిడిచినట్టు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడినట్టు గవర్నర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్టు చెప్పారు.




More Telugu News