న్యాయవాదులు సమ్మె చేయకూడదు: సుప్రీంకోర్టు

  • విధులు కూడా బహిష్కరించకూడదని ఆదేశం
  • వారి సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సూచన
  • జిల్లా స్థాయిలోనూ అలాంటి కమిటీలు ఏర్పాటు చేసుకోవచ్చన్న సుప్రీం 
తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం న్యాయవాదులు విధులు బహిష్కరించి, సమ్మె చేయడాన్ని సుమోటాగా తీసుకొని విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదులు సమ్మె చేయకూడదని, విధులు బహిష్కరించకూడదని స్పష్టం చేసింది. న్యాయవాదుల నిజమైన సమస్యల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలని హైకోర్టులకు సూచించింది. కేసుల నమోదు, లిస్టింగ్‌లో ఉన్న సమస్యలు, కింది కోర్టుల సిబ్బంది ప్రవర్తనపై ఫిర్యాదులు స్వీకరించి, విచారణ జరపడానికి కమిటీలు ఏర్పాటు చేయాలని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లాల ధర్మాసనం ఆదేశించింది. 

ఈ కమిటీకి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు ఉంటారని తెలిపింది. జిల్లా స్థాయిలో కూడా ఇలాంటి కమిటీని ఏర్పాటు చేయాల్సి వస్తే హైకోర్టు పరిశీలించవచ్చని కోర్టు పేర్కొంది. బార్‌ కౌన్సిల్ లోని సభ్యులెవరూ సమ్మెకు వెళ్లరాదని, విధులు బహిష్కరించకూడదని కోర్టు పునరుద్ఘాటించింది.


More Telugu News