స్కూలు బాగు కోసం మోదీకి చిన్నారి విజ్ఞప్తి.. వెంటనే పరిష్కారం!

  • స్కూల్ భవనం బాగా లేదని చిన్నారి అభ్యర్థన
  • కథువాలో కనీస సౌకర్యాలు లేని పాఠశాల
  • వీడియో వైరల్... సమస్యను పరిష్కరించిన అధికారులు
తమ స్కూల్ భవనం ఏ మాత్రం బాగా లేదని, త్వరగా రిపేయిర్ చేయించాలని జమ్ములోని కథువా జిల్లాకు చెందిన చిన్నారి సీరత్ నాజ్ ఓ వీడియో ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి ప్రధాని వద్దకు వెళ్లడంతో ఆ స్కూల్ భవనం వేగవంతంగా పూర్తి చేసే దిశగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ బాలిక చదువుతున్న పాఠశాల అభివృద్ధికి అధికారులు చర్యలు చేపట్టారు. సీరత్ చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. దీంతో ఆమె ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు.

ఐదు నిమిషాల నిడివి కలిగిన వీడియోలో ఆ చిన్నారి స్కూల్ పరిస్థితిని వివరించింది. సాయం చేయాలని కోరింది. మా స్కూల్ ఎలా ఉందో చూడాలని... బెంచీలు ఎలా ఉన్నాయో గమనించండని.. నేల అంతా మట్టి కొట్టుకుపోయి చెత్తగా ఉందని, స్కూల్ యూనిఫామ్ దుమ్ముతో అంటుకొని మాసిపోతోందని అందులో పేర్కొంది. టాయిలెట్ పరిస్థితి దారుణంగా ఉందని, భవనం అంతకంటే ఘోరంగా ఉందని చెప్పింది. ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు చేపట్టింది.

మోదీ గారూ.. మీరెలా ఉన్నారు.. మీరు అందరి విజ్ఞప్తులను వింటున్నారు... నా మాట కూడా వినండి అంటూ ఆ చిన్నారి ముద్దు మాటలతో చేసిన అభ్యర్థన ఫలించింది. జమ్ము పాఠశాలల విభాగం డైరెక్టర్ ఆ బాలిక చదువుతున్న లోహై - మల్హర్ లోని స్కూల్ ను సందర్శించారు. పాఠశాలను బాగు చేసే పనులు కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా సదరు డైరెక్టర్ మాట్లాడుతూ... ఆధునిక సౌకర్యాలతో పాఠశాల అభివృద్ధికి నిధులు కేటాయించారని, అయితే అనుమతుల విషయంలో జాప్యం జరగడంతో పనులు నిలిచిపోయాయని, ఇప్పుడు వాటిని పరిష్కరించామని చెప్పారు. రానున్న నాలుగేళ్లలో జమ్ము ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో కలిపి 1000 కిండర్ గార్డన్లను నిర్మిస్తున్నట్లు చెప్పారు.


More Telugu News