బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు మేలు చేసేలా లక్ష్మీనారాయణ వ్యవహరించడం రాష్ట్రానికి మంచిది కాదు: విష్ణువర్ధన్ రెడ్డి

  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విష్ణువర్ధన్ రెడ్డి
  • ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్ష
  • కేసీఆర్ కుట్రలతో విశాఖ ఉక్కు విలవిల్లాడుతోందని వ్యాఖ్యలు
  • కేఏ పాల్, లక్ష్మీనారాయణకు అవగాహన లేదని విమర్శలు
  • విశాఖ ఉక్కును రాజకీయ స్వార్థంతో అపహాస్యం చేయొద్దని హితవు
బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆలయం నుంచి వెలుపలికి వచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, భారతదేశం నరేంద్ర మోదీ నాయకత్వంలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేఏ పాల్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జంటగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడంపైనా విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కుట్రలతో విశాఖ ఉక్కు విలవిల్లాడుతోందని అన్నారు. 

"సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కానివ్వండి, కేఏ పాల్ కానివ్వండి... విశాఖ స్టీల్ ప్లాంట్ ను, స్టీల్ ప్లాంట్ కార్మికులను, త్యాగాలను మీ అవగాహన రాహిత్యంతో, రాజకీయ స్వార్థంతో అపహాస్యం పాలు చేయొద్దని కోరుతున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వమే నిలబెట్టగలుగుతుంది. ఆ విషయంలో కేంద్రానికి, ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంది. కానీ ఈరోజు కొత్త కొత్త విన్యాసాలు, కొత్త కొత్త తప్పుడు ప్రచారాలు, కొత్త కొత్త అపోహలు సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు మేలు చేసేలా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యవహరించడం ఈ రాష్ట్రానికి మంచిది కాదు" అని వ్యాఖ్యానించారు. 

అంతేకాదు, 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతుందని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని తెలిపారు.


More Telugu News