రిటైర్మెంట్ విషయంలో ధోనీపై ఒత్తిడి తేవొద్దు: మురళీ విజయ్

  • ధోనీ దేశానికి 15 ఏళ్లపాటు సేవలు అందించిన క్రికెటర్ అన్న విజయ్
  • అతడికి ఈ విషయంలో స్వేచ్ఛనివ్వాలని సూచన
  • అది ఎంత బాధను కలిగిస్తుందో అర్థం చేసుకోవాలని హితవు
చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్. ఈ మాట ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ, ధోనీ మాత్రం తాను ఫలానా అప్పుడు రిటైర్ అవుతున్నానని ఇప్పటికీ చెప్పలేదు. ఐపీఎల్ మినహా అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ లకు ధోనీ గుడ్ బై చెప్పేశాడు. ఒక్క ఐపీఎల్ లోనే కొనసాగుతున్నాడు. అతడిలో ఇప్పటికీ ఫిట్ నెస్ ఉందని ఆటను చూస్తే తెలుస్తోంది. అయినా కానీ, ధోనీ రిటైర్మెంట్ పై చర్చ కొనసాగుతూనే ఉంది. దీనిపై చెన్నై జట్టు మాజీ ప్లేయర్ మురళీ విజయ్ స్పందించాడు. 

రిటైర్మెంట్ విషయంలో ధోనీపై ఒత్తిడి తేవొద్దని సూచించాడు. స్పోర్ట్స్ కీదా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘రిటైర్మెంట్ అనేది వ్యక్తిగత ఎంపిక. ధోనీ ఎలాంటి క్రికెటరో ప్రజలు అర్థం చేసుకోవాలి. దేశానికి 15 ఏళ్లు సేవలు అందించాడు. కనుక ఆ నిర్ణయం తీసుకునే విషయంలో మనం అతడికి స్వేచ్ఛనివ్వాలి. అంతేకానీ రిటైర్మెంట్ ఎప్పుడు అంటూ అతడిపై ఒత్తిడి తీసుకురాకూడదు. కూర్చుని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం నాకు ఎంతో కష్టంగా ఉంది. నేను కూడా ఇటీవలే రిటైర్ అయ్యాను. అది ఎంత బాధ కలిగిస్తుందో నాకు తెలుసు. మేము ఈ ఆట కోసం హృదయాన్ని, మనసును అంకితం చేశాం. కనుక ధోనీ రిటైర్మెంట్ విషయంలో కొంత వ్యక్తిగత గోప్యత పాటించాలన్నది నేను చేసే వినతి’’ అని మురళి విజయ్ పేర్కొన్నాడు.


More Telugu News