రైలు కోచ్ లేదా మొత్తంగా రైలునే ఇలా బుక్ చేసుకోవచ్చు..!

  • ఐఆర్ సీటీసీ ఎఫ్ టీఆర్ వెబ్ సైట్ ద్వారా బుకింగ్ సేవలు
  • ఒక్కో కోచ్ కు సెక్యూరిటీ డిపాజట్ గా రూ.50 వేలు
  • నెల రోజుల ముందు బుక్ చేసుకోవచ్చు
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కలసి ఎటైనా పర్యటన పెట్టుకుంటే అంతా కలసి ఓ రైలు కోచ్ ను బుక్ చేసుకోవచ్చు. లేదంటే పెళ్లి కోసం, లేదా మరో అవసరం కోసం కావాలంటే ఓ రైలునే బుక్ చేసుకునేందుకు ఐఆర్ సీటీసీ అవకాశం కల్పిస్తోంది. బుకింగ్ కోసం https://www.ftr.irctc.co.in/ftr/ పోర్టల్ కు వెళ్లాల్సి ఉంటుంది. 

అన్ని రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేకంగా కోచ్, రైలు సేవలను బుక్ చేసుకోవచ్చు. చార్టర్డ్ కోచ్ ను బోర్డింగ్ స్టేషన్ లో రెగ్యులర్ రైలు సర్వీస్ కు అటాచ్ చేస్తారు. కాకపోతే గమ్యస్థానం మాత్రం కనీసం 10 నిమిషాల పాటు రైలు హాల్ట్ ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి కనిష్ఠంగా 30 రోజులు, గరిష్ఠంగా ఆరు నెలల ముందు బుక్ చేసుకోవచ్చు. 

ఒక రైలు సర్వీస్ కు గరిష్ఠంగా రెండు కోచ్ లను బుక్ చేసుకోవచ్చు. అదే ట్రెయిన్ చార్టర్ అయితే గరిష్ఠంగా 24 కోచ్ లను బుక్ చేసుకోవచ్చు. కనీసం 18 కోచ్ లు అయినా ఉండాలి. కనీసం రెండు స్లీపర్ కోచ్ లు బుక్ చేసుకోవడం తప్పనిసరి. రిజిస్ట్రేషన్, సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్కో కోచ్ కు రూ.50 వేలు చెల్లించాలి. మరిన్ని వివరాలకు ఐఆర్ సీటీసీ కస్టమర్ కేర్ ను సంప్రదించొచ్చు.


More Telugu News