తెలంగాణ సచివాలయం ఎదుట తెలుగు తల్లి, పొట్టిశ్రీరాములు విగ్రహాల తొలగింపు !

  • నాలుగు రోజుల కిందటి వరకు ఉన్న విగ్రహాలు
  • రాత్రికి రాత్రే తీసేసిన అధికారులు
  • విగ్రహాలను మళ్లీ ఎక్కడ ప్రతిష్టిస్తారన్న దానిపై లేని స్పష్టత
తెలంగాణ కొత్త సచివాలయానికి ఎదురుగా ఉన్న తెలుగు తల్లి విగ్రహం, పొట్టి శ్రీరాములు విగ్రహం కనిపించడం లేదు. నాలుగు రోజుల కిందట వరకు ఉన్న విగ్రహాలను రాత్రికి రాత్రే అధికారులు తీసేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విగ్రహాలను మళ్లీ ఎక్కడ ప్రతిష్టిస్తారన్న విషయంపై స్పష్టత లేదు.

ఈ విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠిస్తామని గానీ, ఇంకో ప్రాంతంలో పెడతామని గానీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి విగ్రహాలను ప్రభుత్వం కావాలనే తొలగించిందంటూ విమర్శలు వస్తున్నాయి. 

సెక్రటేరియట్ ప్రాంతంలో తెలుగు తల్లి విగ్రహం ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. అక్కడి ఫ్లైఓవర్‌ను తెలుగు తల్లి ఫ్లైఓవర్ గా పిలుస్తుంటారు. అయితే కొత్త సచివాలయానికి దారి కోసం తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో అడ్డువస్తాయన్న కారణంతో విగ్రహాలను తొలగించినట్లుగా తెలుస్తోంది. 

సచివాలయాన్ని ఈ నెలాఖరులో ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకోసం శరవేగంగా పనులు సాగుతున్నాయి. పాత సెక్రటేరియట్ ను కూల్చేసిన సమయంలో పడగొట్టిన ఆలయం, మసీదును మళ్లీ నిర్మించారు. ఇక సచివాలయం ఎదురుగా చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్మారక నిర్మాణం కూడా చివరి దశకు చేరుకుంది.


More Telugu News