సీతకొండలోని అబ్దుల్ కలామ్ వ్యూ పాయింట్ పేరును వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా మార్చిన ప్రభుత్వం

  • పర్యాటక ప్రాంతమైన సీతకొండలోని వ్యూ పాయింట్ పేరు మార్పు 
  • అబ్దుల్ కలామ్‌కు అవమానమన్న చంద్రబాబు
  • తాము అభివృద్ది చేస్తే మీరెలా మారుస్తారంటూ వైజాగ్ వలంటీర్స్ సంస్థ అభ్యంతరం
విశాఖపట్టణం బీచ్ రోడ్డులో ఉన్న సీతకొండ వ్యూపాయింట్ పేరు మారిపోయింది. పర్యాటకులతో రద్దీగా కనిపించే ఈ ప్రాంతం ఇప్పుడు ‘వైఎస్సార్ వ్యూ పాయింట్’గా మారింది. ఈ మేరకు అధికారులు ఓ మార్బుల్ స్టోన్‌పై పెద్దపెద్ద అక్షరాలు చెక్కించారు. 

నగరంలో ఇటీవల జరిగిన జి-20 సన్నాహక సదస్సు సందర్భంగా జీవీఎంసీ అధికారులు సీతకొండ అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడి అబ్దుల్ కలామ్ వ్యూ పాయింట్ పేరును మార్చి వైఎస్సార్ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఫైల్‌కు గత నెలలో ఆమోదం లభించింది. తాజాగా 150 మీటర్ల పరిధిలో సుందరీకరణ పనులు పూర్తిచేసి ‘అబ్దుల్ కలామ్ వ్యూ పాయింట్’ స్థానంలో ‘వైఎస్సార్ వ్యూ పాయింట్’ అని అక్షరాలు చెక్కించారు. 

అబ్దుల్ కలామ్‌కు అవమానం: చంద్రబాబు
సీతకొండలోని అబ్దుల్ కలామ్ వ్యూ పాయింట్ పేరును వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా మార్చడంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఇది చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు మార్చడం మానసిక శాడిజానికి ప్రతీక అని దుమ్మెత్తిపోస్తూ వ్యూ పాయింట్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. 

నిజాయతీ, క్రమశిక్షణ, పట్టుదలకు అబ్దుల్ కలామ్ మారుపేరని, ప్రజలు ఎంతగానో ఇష్టపడే ఆయనను పేరు మార్పు ద్వారా అవమానించారని దుమ్మెత్తి పోశారు. కాగా, వ్యూ పాయింట్‌కు అబ్దుల్ కలాం పేరు పెట్టి అభివృద్ధి చేసింది తామేనని, ఇప్పుడు దాని పేరును మార్చడం సరికాదని వైజాగ్ వలంటీర్స్ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.


More Telugu News