రంజాన్‌కు ముందు యెమెన్‌లో తీరని విషాదం.. తొక్కిసలాటలో 85 మంది మృతి

  • సహాయక సామగ్రి పంపిణీలో తొక్కిసలాట
  • 322 మందికి గాయాలు
  • కుప్పలుగా పడివున్న మృతదేహాలు
  • తొక్కిసలాటకు కారకులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు
  • అంతర్యుద్ధంతో చితికిపోయిన యెమెన్
ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ మాసం ముగింపునకు ముందు అరేబియాలోని అత్యంత పేద దేశమైన యెమెన్‌లో తీరని విషాదం నెలకొంది. ఈదుల్ ఫితర్‌ను పురస్కరించుకుని నిర్వహించిన ఓ చారిటీ పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 80 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వందలాదిమంది గాయపడ్డారు. ఇది ఈ దశాబ్దంలోనే ఘోరమైన తొక్కిసలాట అని హుతీ అధికారులు పేర్కొన్నారు. బాబల్ యెమెన్ జిల్లాలో జరిగిన ఈ తొక్కిసలాటలో 85 మంది మరణించారని, 322 మంది గాయపడ్డారని తెలిపారు. 

మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. ఓ స్కూల్‌లో సహాయ సామగ్రి పంపిణీ చేస్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. యుద్ధంతో దారుణంగా దెబ్బతిన్న పేద దేశమైన యెమెన్‌లో సహాయ సామగ్రి కోసం వందలాదిమంది స్కూలు వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట పెను ప్రాణ నష్టానికి దారితీసింది.

మృతదేహాలు కుప్పలుగా పడివున్న దృశ్యాలను స్థానిక టీవీ చానళ్లు ప్రసారం చేశాయి. సహాయక సామగ్రిని సొంతం చేసుకునేందుకు జనం పోటీపడడం, ఒకరినొకరు నెట్టుకుంటూ, ఒకరి తలపై మరొకరు నడుచుకుంటూ వెళ్లడంతోనే ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా పేర్కొంది. 

మృతదేహాలతోపాటు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. తొక్కిసలాటకు కారణమైన వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారన్న కచ్చితమైన సమాచారం తెలియరాలేదు. అయితే, కొందరు వ్యాపారులు డబ్బులు పంపిణీ చేయడంతోనే ఈ ఘటన జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.

ఈ ఘటనపై విచారణ జరపనున్నట్టు హుతీ రాజకీయ ముఖ్యుడు మహదీ అల్ మషట్ తెలిపారు. తొక్కిసలాటకు కారణమైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు భద్రతా దళాలు ప్రకటించాయి. యెమెన్‌లో 8 ఏళ్లకుపైగా జరిగిన అంతర్యుద్ధం ప్రపంచంలో అత్యంత ఘోరమైన మానవతా విషాదాలలో ఒకటిగా ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది.


More Telugu News