ధర్మపురి స్ట్రాంగ్ రూం వివాదంపై హైకోర్టు కీలక ఆదేశం

  • ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల కేసులో స్ట్రాంగ్ రూం సీల్ పగలగొట్టేందుకు కోర్టు అనుమతి 
  • అన్ని పార్టీల సమక్షంలో తలుపులు తెరవాలని కలెక్టర్‌కు ఆదేశం
  • తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా
ధర్మపురి ఎన్నికల అవకతవకల కేసులో హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. స్ట్రాంగ్ రూం తలుపుల తాళాలు పగలగొట్టి ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలని ఆదేశించింది. 

2018లో జరిగిన ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ కాంగ్రెస్ అభ్యర్థి అట్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్‌లో అన్యాయం జరిగిందని పిటిషన్ దాఖలు చేశారు. నాటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్.. అట్లూరి లక్ష్మణ్‌పై స్వల్ప మెజారిటీతో గెలిచారు. 

అయితే.. నాలుగేళ్ల తరువాత ఈ వివాదంపై కోర్టు తీర్పు వెలువరించింది. స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచిన ఎన్నికల కౌంటింగ్ పత్రాలను సమర్పించాలని న్యాయస్థానం ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. ఈ నెల 10న స్ట్రాంగ్ రూం తలుపులు తెరిచేందుకు వెళ్లిన అధికారులకు తాళంచెవులు కనిపించలేదు. దీంతో, తాళాలు కనిపించకపోవడంపై లక్ష్మణ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో, కీస్ మిస్సింగ్ వివాదంపై విచారణ చేపట్టాలంటూ ఎన్నికల అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఢిల్లీ అధికారుల బృందం జేఎస్‌టీయూ కాలేజీలో విచారణ చేపట్టింది.

అయితే.. తాళం చెవి సరిపోక స్ట్రాంగ్ రూం తెరవలేకపోయామని జగిత్యాల జిల్లా కలెక్టర్ న్యాయస్థానానికి తెలిపారు. ఎన్నికల డాక్యుమెంట్లు కావాలంటే స్ట్రాంగ్ రూం తాళం పగలగొట్టడం మినహా ప్రత్యామ్నాయం లేదని కోర్టుకు తెలిపారు. స్ట్రాంగ్ రూం తాళాల గల్లంతుపై విచారణ జరుగుతోందని ధర్మాసనానికి విన్నవించారు. మరోవైపు.. స్ట్రాంగ్ రూం తాళం చెవులు ఉద్దేశపూర్వకంగానే మాయం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ తరఫు న్యాయవాది ఆరోపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు చివరకు తాళాలు పగలగొట్టేందుకు అనుమతించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.


More Telugu News