75 రోజులు పూర్తి చేసుకున్న లోకేశ్ పాదయాత్ర.. ఈనాటి హైలైట్స్

  • ఇప్పటి వరకు 976.8 కిలోమీటర్లు చేసిన లోకేశ్
  • మంత్రి గుమ్మనూరు కబ్జాలు, సెటిల్మెంట్లలో మునిగితేలుతున్నాారని విమర్శ
  • రేపు ఆదోని నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న పాదయాత్ర 
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 75వ రోజు ముగిసింది. ఈరోజు ఆయన పాదయాత్ర కర్నూలు నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గంలో 15.5 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఇప్పటి వరకు లోకేశ్ 976.8 కిలోమీటర్లు నడిచారు. అడుగడుగునా ప్రజలు మండుటెండలను సైతం లెక్కచేయకుండా యువనేతకు ఎదురేగి స్వాగతం పలుకుతూ తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఆలూరు నియోజకవర్గం కైరుప్పలలో యువనేతకు మహిళలు,రైతులు,నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. 

ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను వివరిస్తూ...  నకిలీ విత్తనాలతో నష్టపోతున్నామని వాపోయారు. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చాక నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, విద్యుత్ ఛార్జీలను నియంత్రిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. కారుమంచి శివార్లలో ఓ పొలంలోకి వెళ్లిన యువనేత అక్కడ అరక దున్ని రైతు కష్టాలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామానంతరం పాదయాత్ర దారిలో మురికికూపం నడుమ ఉన్న కారుమంచి అంగన్ వాడీ కేంద్రం, బోరు వద్ద ప్లాస్టిక్ బిందెలతో క్యూకట్టిన జనం వద్దకు వెళ్లి సెల్ఫీ దిగిన లోకేశ్ ప్రభుత్వ పెద్దల వైఫల్యాలను ఎత్తిచూపారు. మూడురోజులపాటు ఆలూరు నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర...  గురువారం ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. 

సెల్పీతో యువనేత చురకలు...
మేనమామలా చూసుకోవడమంటే ఇదేనా?

ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం కారుమంచి అంగన్ వాడీ కేంద్రం సెల్ఫీదిగిన యువనేత లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మురికికూపం నడుప ఉన్న ఈ అంగన్ వాడీ కేంద్రం వద్ద బిక్కుబక్కుమంటూ చూస్తున్న ఈ చిన్నారులను చూశావా ముఖ్యమంత్రీ? ఇక్కడకు వస్తే పౌష్టికాహారం మాట దేవుడెరుగు, రోగాలపాలు కావడం మాత్రం ఖాయం. చిన్నారులను మేనమామలా చూసుకోవడమంటే మురికికూపంలోని నెట్టి లేని రోగాలను అంటించడమా జగన్ రెడ్డీ? అంటూ చురకలు అంటించారు.

జనంపడే కష్టాలు చూశావా బెంజి మంత్రీ?
ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం కారుమంచి గ్రామంలో బోరువద్ద ప్లాస్టిక్ బిందెలతో క్యూకట్టిన స్థానిక ప్రజల వద్దకు వెళ్లి సెల్ఫీ దిగిన లోకేష్ మంత్రి గుమ్మనూరును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఊర్లో ఉన్న ఏకైక బోరు వద్ద నీళ్లు పట్టుకొని తోపుడుబళ్లపై తోలుకుంటూ గొంతు తడుపుకుంటున్నారు. ప్రజల బాగోగులు చూడాల్సిన స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు భూకబ్జాలు, సెటిల్మెంట్లతో మునిగితేలుతూ జనం కష్టాలు గాలికొదిలేసి నాలుగేళ్లుగా ముఖం చాటేశారు. నీ నియోజకవర్గంలో గుక్కెడు నీళ్లందక ప్రజలు పడుతున్న ఈ అవస్థలు చూశావా బెంజి మంత్రి గారూ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇప్పుడే రాజకీయాలొద్దు... మంచిగా చదువుకో!
బాలుడికి నచ్చజెప్పి పంపించేసిన యువనేత

యువగళం పాదయాత్రలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చేసుకుంది. ఆలూరు నియోజకవర్గం పుప్పలదొడ్డిలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్న సమయంలో  ఓ బుడతడు పసుపురంగు టీషర్టుతో ఉత్సాహంగా యాత్రలో అడుగులు వేస్తున్నాడు. ఇది గమనించిన యువనేత లోకేష్ ఆ బాలుడ్ని దగ్గరకు తీసుకొని అప్యాయంగా పలకరించి కుశలప్రశ్నలు వేశారు. అప్పుడే రాజకీయాలు వద్దు, ముందు మంచిగా చదువుకోవాలని చెప్పి టీషర్టు తీయించి నచ్చజెప్పి పంపించేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ లబ్ధిపొందేందుకు తహతహలాడుతున్న ఈరోజుల్లో బాలుడి భవిష్యత్ కోసం దూరదృష్టితో ఆలోచించారు యువనేత లోకేష్.

చిన్నారుల వద్దకు యువనేత... ఆనందంతో కేరింతలు
పాదయాత్ర దారిలో యువనేత స్కూలు చిన్నారుల వద్దకు వెళ్లడంతో వారు ఆనందంతో కేరింతలు కొట్టారు. పాదయాత్ర ఆలూరు నియోజకవర్గం కైరుప్పల చేరుకున్నప్పుడు దారిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తనకోసం వేచిచూడటం గమనించిన యువనేత వారి వద్దకు వెళ్లారు. దీంతో అక్కడ ఉన్న చిన్నారులు ఒక్కసారిగా లోకేష్ ను చుట్టుముట్టి కౌగలించుకున్నారు. ఏం చదువుకుంటున్నారు, మార్కులు ఎలా వస్తున్నాయి, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అని యువనేత వారిని అడిగారు. కొందరు చిన్నారులు మధ్యాహ్న భోజనం సరిగా ఉండటం లేదని చెప్పారు. ఉపాధ్యాయులను గౌరవించాలి, బాగా చదువుకొని అమ్మా నాన్న లకు మంచి పేరు తేవాలి. ఉన్నత స్థానాలకు చేరుకోవాలని చెప్పిన యువనేత విద్యార్థులతో ఫోటోలు దిగి, చాక్లెట్లు ఇచ్చి అక్కడనుంచి బయలుదేరారు.


*76వరోజు (20-4-2023) యువగళం వివరాలు:*
*ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం (కర్నూలు జిల్లా)*

ఉదయం
7.00 – ములిగుండం శివారు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
8.30  – ఆదోని అసెంబ్లీ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశం.
9.00  – పెదపెండేకల్ లో స్థానికులతో మాటామంతీ.
11.05 – ఆరేకల్ లో వాల్మీకులతో సమావేశం.
12.00 – నాగలాపురంలో యువతతో ముఖాముఖి.
1.00 – నాగలాపురంలో భోజన విరామం
సాయంత్రం
4.00  –నాగలాపురం నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.15 – నాగలాపురం క్రాస్ వద్ద కోలనాట సామాజికవర్గీయులతో భేటీ.
5.25  – కాపటి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
6.00 – ఆదోని విడిది కేంద్రంలో బస.


More Telugu News