ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్ కు చోటు.. ఎన్నో స్థానంలో ఉందంటే..!

  • భాగ్యనగరంలో 11,100 మంది మిలియనీర్లు
  • 97 పట్టణాలతో జాబితా విడుదల చేసిన హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ
  • దేశ ఆర్థిక రాజధాని ముంబైకి 21వ స్థానం
  • ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు నగరాలకూ చోటు
ఐటీ, ఫార్మా, నిర్మాణ రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ ప్రపంచ నగరంగా మారుతోంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల జాబితాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు చోటు దక్కింది. ఈ జాబితాలో భాగ్యనగరం 65వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ లో 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు 2012 నుంచి 2022 మధ్య పదేళ్ల కాలంలో‘అత్యధిక నికర సంపదగల వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరిగినట్టు తెలిపింది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ రూపొందించిన 'ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల నివేదిక 2023'లో మొత్తం 97 పట్టణాలు చోటు దక్కించుకున్నాయి. 

భారత్ నుంచి హైదరాబాద్ సహా ఐదు నగరాలు ఇందులో ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై 21వ స్థానం దక్కించుకొంది. 59,400 మంది మిలియనీర్లతో ముంబై భారత్ నుంచి అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ 30,200 మిలియనీర్లతో మొత్తంగా 36వ స్థానంలో ఉండగా.. బెంగళూరు 12,600 మంది మిలియనీర్లతో 60వ స్థానంలో నిలిచింది. కోల్ కతా 12,100 మందితో 63వ స్థానంలో, హైదరాబాద్ 11,100 మందితో 65వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచ నగరాల జాబితాలో అమెరికాలోని న్యూయార్క్ సిటీ అగ్ర స్థానంలో నిలిచింది. న్యూయార్క్ లో 3,40,000 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్ పార్ట్నర్స్ వెల్లడించింది.


More Telugu News