అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడ్డ 1.49 లక్షల మంది భారతీయులు

  • అమెరికా స్వప్నం నెరవేర్చుకునేందుకు అడ్డదారుల్లో ప్రయాణం
  • కెనడా, మెక్సికో వైపు నుంచి చొరబాటుకు యత్నం
  • పట్టుబడ్డ వారిలో ఎక్కువ మందికి అక్కడ క్షమాభిక్ష
ఎంతో మంది భారతీయ విద్యార్థులకు ‘అమెరికాలో అడుగు పెట్టడం’ ఓ స్వప్నం. ప్రపంచంలో ధనిక దేశమైన అమెరికాలో కొన్నేళ్లు కష్టపడినా చాలు.. జీవితాంతం హ్యాపీగా సెటిలైపోవచ్చన్న ఆకాంక్ష చాలా మందిలో ఉంటుంది. అమెరికాలోనే సెటిలైపోవాలని కోరుకునే వారూ ఎక్కువే. ఇందుకోసం ఎక్కువ మంది చిత్తశుద్ధితో కష్టపడి కృషి చేస్తుంటారు. కానీ, కొంత మంది ఆర్థిక స్తోమత, అర్హతలు లేక అడ్డదారి చూసుకుంటున్నారు. సరిహద్దు దేశాలకు చేరి అక్రమంగా అమెరికాలో చొరబాటుకు ప్రయత్నిస్తున్నారు. 

2019 ఫిబ్రవరి నుంచి 2023 మార్చి మధ్య నాలుగేళ్ల కాలంలో 1.49 లక్షల మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం గణాంకాలను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్న వారు కూడా ఉన్నారు. ఇలా అమెరికా సరిహద్దుల్లో పట్టుబడే వారిలో ఎక్కువ మంది గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల వారే ఉంటున్నారు. 

2022 జనవరిలో 5,459 మంది అమెరికాలోకి చొరబడుతూ దొరికిపోయారు. 2023 జనవరిలో చొరబాటుకు ప్రయత్నించి 7,421 మంది భారతీయులు పట్టుబడ్డారు. ఎక్కువ మంది కెనడా సరిహద్దుల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఆ తర్వాత మెక్సికో సరిహద్దుల నుంచి వస్తున్నారు. అయితే, అమెరికా సరిహద్దుల్లో పట్టుబడే వారిలో భారతీయులు 2 శాతంగానే ఉంటున్నారు. ఈ ఏడాది మార్చిలోనూ 9,648 మంది భారతీయులు యూఎస్ బోర్డర్ గార్డుల చేతికి చిక్కారు. అమెరికాలోకి చొరబడడానికి ముందే మెక్సికో, కెనడా సరిహద్దు భద్రతా సిబ్బంది చేతికి చిక్కి వెనుదిరిగే వారూ ఉన్నారు.

చివరిగా ఊరటనిచ్చే విషయం ఏమిటంటే అమెరికాలోకి చొరబడుతూ దొరికిపోయిన వారిలో అధిక శాతం మందికి మానవతా కోణంలో ఆశ్రయం లభిస్తోంది. వారికి క్షమాభిక్షను అక్కడి సర్కారు ప్రకటిస్తోంది. ప్రపంచంలో ఎక్కువ మందికి ఆశ్రయం కల్పిస్తున్న దేశంగా అమెరికాకు పేరుంది. అమెరికా స్వప్నం నెరవేర్చుకునేందుకు ఇలా అడ్డదారులు దొక్కేవారు కూడా ఎంతో కొంత ఖర్చు చేయక తప్పడం లేదు.


More Telugu News