సన్ రైజర్స్ కు ఆఖరి వికెట్... అర్జున్ టెండూల్కర్ కు మొదటి వికెట్

  • సొంతగడ్డపై ఓటమిపాలైన సన్ రైజర్స్
  • ముంబయి చేతిలో 14 పరుగుల తేడాతో పరాజయం
  • 193 పరుగుల లక్ష్యఛేదనలో 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌట్
  • ఐపీఎల్ కెరీర్ లో తొలి వికెట్ సాధించిన సచిన్ తనయుడు
ముంబయి ఇండియన్స్ తో సొంతగడ్డపై జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 193 పరుగుల లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ 19.5 ఓవర్లలో 178 పరుగులకే ఆలౌట్ అయింది. సన్ రైజర్స్ భువనేశ్వర్ కుమార్ రూపంలో ఆఖరి వికెట్ కోల్పోగా... సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కు ఐపీఎల్ తో అదే తొలి వికెట్ అయింది. 

చివరి ఓవర్లో సన్ రైజర్స్ 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా... ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ బంతిని అర్జున్ టెండూల్కర్ కు అప్పగించాడు. పెద్దగా అనుభవం లేకపోవడంతో అర్జున్ ఎలా బౌలింగ్ చేస్తాడోనని అభిమానులు ఆందోళన చెందారు. 

కానీ, ఎడమచేతివాటం పేసర్ అర్జున్ టెండూల్కర్ అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేసి సన్ రైజర్స్ కు ఎలాంటి అవకాశం ఇవ్వకపోగా, భువనేశ్వర్ ను అవుట్ చేశాడు. దాంతో సన్ రైజర్స్ ఇన్నింగ్స్ కు తెరపడింది. 2.5 ఓవర్లు విసిరిన సచిన్ తనయుడు 18 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. 

అసలు, భారీ లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ ఆరంభంలోనే తడబడింది. 25 పరుగులకే హ్యారీ బ్రూక్ (9), రాహుల్ త్రిపాఠీ (7) అవుట్ కాగా... మయాంక్ అగర్వాల్ (48), కెప్టెన్ మార్ క్రమ్ (22) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ హెన్రిచ్ క్లాసెన్ (36) దూకుడుగా ఆడి సన్ రైజర్స్ లో ఆశలు నింపాడు. 

ఈ దశలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన సన్ రైజర్స్ ఓటమి ముంగిట నిలిచింది. అయితే, మార్కో జాన్సెన్ (13), వాషింగ్టన్ సుందర్ (10) కొన్ని బౌండరీలో కొట్టడంతో సన్ రైజర్స్ లో ఆశలు చిగురించాయి. భారీ షాట్ కొట్టే యత్నంలో జాన్సెన్ అవుట్ కాగా, నిదానంగా పరుగుతీసి సుందర్ రనౌట్ అయ్యాడు. 

అబ్దుల్ సమద్ (9) భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించినా, ముంబయి ఇండియన్స్ బౌలర్లు యార్కర్ లెంగ్త్ బంతులు విసరడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో బెహ్రెండార్ఫ్ 2, రిలే మెరిడిత్ 2, పియూష్ చావ్లా 2, కామెరాన్ గ్రీన్ 1, అర్జున్ టెండూల్కర్ 1 వికెట్ తీశారు. 

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. కామెరాన్ గ్రీన్ 64 (నాటౌట్), ఇషాన్ కిషన్ 38, తిలక్ వర్మ 37, కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగులు చేశారు.


More Telugu News