ఉప్పల్ స్టేడియంలో గ్రీన్, తిలక్ విధ్వంసం... సన్ రైజర్స్ కు భారీ టార్గెట్

  • సన్ రైజర్స్ వర్సెస్ ముంబయి ఇండియన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 రన్స్ చేసిన ముంబయి
  • గ్రీన్ 40 బంతుల్లో 64 నాటౌట్
హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుతో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఆటగాడు కామెరాన్ గ్రీన్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ముంబయి ఇండియన్స్ ను తక్కువ స్కోరుకు పరిమితం చేద్దామని భావించిన సన్ రైజర్స్ కు గ్రీన్ అడ్డుపడ్డాడు. గ్రీన్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

మరో ఎండ్ లో లోకల్ బాయ్ తిలక్ వర్మ కూడా బ్యాట్ ఝుళిపించాడు. తిలక్ వర్మ 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో చకచకా 37 పరుగులు చేశాడు. తిలక్ వర్మ అవుట్ కావడంతో ఊపిరి పీల్చుకున్న సన్ రైజర్స్... గ్రీన్ దూకుడును మాత్రం అడ్డుకోలేకపోయింది. 

ఈ మ్యాచ్ లో 150-160 పరుగులు స్కోరు చేస్తుందనుకున్న ముంబయి ఇండియన్స్ గ్రీన్, తిలక్ వర్మ బాదుడుతో భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసింది. మొదట్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన సన్ రైజర్స్ బౌలర్లు మిడిల్ ఓవర్లలో తేలిపోయారు. మార్ క్రమ్ ఫీల్డింగ్ లో మూడు క్యాచ్ లు అందుకోవడం విశేషం.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయికి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ జోడీ తొలి వికెట్ కు 41 పరుగులు జోడించి శుభారంభం అందించింది. ఇషాన్ కిషన్ 38, రోహిత్ శర్మ 28 పరుగులు చేశారు. సన్ రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సెన్ 2, భువనేశ్వర్ 1, నటరాజన్ 1 వికెట్ తీశారు. 

ఇక, 193 పరుగుల భారీ లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన ఓపెనర్ హ్యారీ బ్రూక్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరుకు అవుటై నిరాశపరిచాడు. ఆ తర్వాత కాసేపటికే రాహుల్ త్రిపాఠి (7) కూడా అవుటయ్యాడు. ఈ రెండు వికెట్లు బెహ్రెండార్ఫ్ ఖాతాలోకి వెళ్లాయి. ప్రస్తుతం సన్ రైజర్స్ స్కోరు 4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు. మయాంక్ అర్వాల్ 6 పరుగులతోనూ, మార్ క్రమ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.


More Telugu News