గంటన్నరలో 22 పెగ్గుల మద్యం తాగించారు... అదే ఆఖరు!

  • పోలాండ్‌లో వెలుగు చూసిన షాకింగ్ ఘటన
  • విదేశీ పర్యాటకులే లక్ష్యంగా రెచ్చిపోయిన ముఠా
  • బ్రిటన్ వ్యక్తికి 22 పెగ్గుల మద్యం తాగించి స్పృహ తప్పేలా చేసిన వైనం
  • చివరకు అతడి డబ్బు దోచుకుని పరార్
  • ఆల్కాహాల్ టాక్సిసిటీ కారణంగా బాధితుడి మృతి
  • ఈ కేసులో 58 మంది నిందితులపై తాజాగా కేసు నమోదు
గతనెలలో పోలాండ్‌లో ఓ బ్రిటన్ వ్యక్తి హత్యకు గురైన ఘటనలో పోలీసులు తాజాగా 58 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటికే తాగిన మైకంలో ఉన్న అతడితో బలవంతంగా మద్యం తాగించి హత్య చేసినట్టు తాజాగా పేర్కొన్నారు. పోలాండ్‌లో కొందరు నిందితులు ఓ బృందంగా ఏర్పడి అమాయక పర్యాటకులను టార్గెట్ చేసుకుంటున్నట్టు వారు తెలిపారు. పర్యాటకులు మద్యం మత్తులో కూరుకుపోయాక వారి వద్ద ఉన్న డబ్బు దోచుకుంటారని తెలిపారు. 

తాజాగా కేసులో మార్క్ సీ అనే బ్రిటన్ పౌరుడు ఓ క్లబ్‌కు వెళ్లాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న అతడికి ఉచిత ప్రవేశం ఆశ చూపి నిందితులు క్లబ్‌లోకి రప్పించారు. ఆ తరువాత అతడిపై ఒత్తిడి తెచ్చి గంటన్నర వ్యవధిలో మొత్తం 22 పెగ్గుల మద్యం తాగేలా చేశారు. దీంతో... స్పృహ తప్పిపడిపోయిన అతడు చివరకు మృతి చెందాడు. అల్కాహాల్ టాక్సిసిటీ (అధిక మోతాదుల్లో ఆల్కాహాల్ ప్రాణాంతకం) కారణంగా మరణం సంభవించిందని పోస్ట్ మార్టం నివేదికలో తేలినట్టు పోలీసులు తెలిపారు. 

అతడి శరీరంలో అప్పటికే ఆల్కహాల్ శాతం 0.4 గా ఉందని, ఇది ప్రాణాంతకమని పోలాండ్ జాతీయ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక బాధితుడు స్పృహ కోల్పోయాక నిందితులు అతడి వద్ద ఉన్న నగదు తీసుకుని ఉడాయించినట్టు పేర్కొన్నారు.  ఓ బృందంగా ఏర్పడి పర్యాటకులను టార్గెట్ చేస్తున్న నిందితులపై మొత్తం 700 రకాల అభియోగాలు మోపినట్టు పేర్కొన్నారు.


More Telugu News