రెండ్రోజుల్లో ఢిల్లీకి జగన్... అందుకే విదేశీ పర్యటన వాయిదా: సీఎస్ జవహర్ రెడ్డి

  • మా పర్యటనలో సీఎం ఉండాలని నిర్ణయించామన్న సీఎస్
  • ఢిల్లీ పర్యటనపై మీడియాలో దుష్ప్రచారం
  • నిధులు లేకే జగనన్న వసతి దీవెన వాయిదా
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర కార్యదర్శుల సమావేశానికి బుధవారం ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించామని, ఈ పర్యటనలో తమతో పాటు ముఖ్యమంత్రి కూడా ఉండాలని కోరుతున్నామన్నారు.

రెండు రోజుల్లో జగన్ కూడా ఢిల్లీకి వస్తారని, అందుకోసమే ఆయన విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. కేంద్ర కార్యదర్శుల సమావేశంతో పాటు ఉన్నతస్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన అవసరం ఢిల్లీలో ఉందన్నారు. రాష్ట్ర విభజన సంబంధిత అంశాల్లో కొన్ని కొలిక్కి వచ్చాయని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పైన మీడియాలో దుష్ప్రచారం సాగుతోందన్నారు. 

జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా పైన కూడా మాట్లాడారు. నిధులు లేకపోవడం వల్లే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు. ఆర్థిక శాఖ ఈ మేరకు సూచనలు చేసిందన్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలుకు నిధుల ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


More Telugu News