సూడాన్‌లో 24 గంటల కాల్పుల విరమణ... కర్ణాటక వాసుల పరిస్థితిపై ఆందోళన

  • సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య పోరు
  • హింసాత్మక ఘటనలో 200 మంది మృతి, వేలాది మందికి గాయాలు
  • భారతీయులకు... ఇండియన్ ఎంబసీ సూచనలు
సూడాన్ దేశంలో సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య నాలుగు రోజులుగా పోరు కొనసాగుతోంది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ పోరు శనివారం నుండి హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 200 మంది ప్రాణాలు కోల్పోగా, 1800 మంది గాయపడినట్లు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి వెల్లడించారు. సూడాన్ రాజధాని ఖార్తూమ్ సహా పలు ప్రాంతాలు కాల్పులు, బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. ఆహారం, వైద్యం అందక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొద్ది రోజుల క్రితం పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ ను సైన్యంలో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇది ఆర్మీ, పారా మిలిటరీ బలగాల మధ్య ఘర్షణకు దారి తీసింది. సైన్యాధిపతి అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్, పారా మిలటరీ కమాండర్ మహ్మద్ హందాన్ డగ్లో మధ్య కొద్ది వారాలుగా నెలకొన్న విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శనివారం నుండి ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నది. మరోవైపు, పౌరుల సురక్షిత తరలింపు కోసం ప్రస్తుతం ఇరువర్గాలు 24 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి.

సూడాన్ లో చిక్కుకున్న భారతీయులు

భారత్ కు చెందిన వారు ఈ అల్లర్లలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కర్నాటకకు చెందిన 31 మంది ఈ దేశంలో చిక్కుకున్నారని సమాచారం. దీనిపై కర్ణాటక డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ... విదేశాంగ శాఖ, సూడాన్ లోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరిపింది. సూడాన్ లో చిక్కుకున్న భారతీయులకు సూడాన్ లోని భారత రాయబార కార్యాలయం పలు సూచనలు చేసింది. 

ఈ పరిస్థితి మరికొద్ది రోజులు ఉండవచ్చునని, భారతీయులు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. 24X4 హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇచ్చింది. ఫోన్ నెంబర్లు... 91-11-23012113, 91-11-23014104, 91-11-23017905, మొబైల్ నెంబర్.. 91-99682 91988. ఏదైనా సహాయం కావాలంటే ఈ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.


More Telugu News