ఢిల్లీలో 433 శాతం పెరిగిన కరోనా కేసులు

  • మార్చి 30న దేశరాజధానిలో యాక్టివ్ కేసుల సంఖ్య 932
  • ఏప్రిల్ నాటికల్లా 4,976కి చేరుకున్న వైనం
  • 18 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్యలో 433 శాతం వృద్ధి
  • హాస్పిటలైజేషన్ రేట్లు పెరగకపోవడం ఊరటనిచ్చే అంశమంటున్న నిపుణులు
దేశ రాజధానిలో కరోనా విజృంభిస్తోంది. మార్చి 30న ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 932 కాగా ఆ తరువాత పక్షం రోజుల్లోనే పరిస్థితిలో చాలా భారీ మార్పు చోటుచేసుకుంది. ఏప్రిల్ 17 నాటికి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ఏకంగా 4,976కి చేరుకుంది. అంటే..మూడు వారాల్లోనే కేసుల సంఖ్య ఏకంగా 433 శాతం మేర పెరిగింది. 

యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య (హాస్పిటలైజేషన్ రేట్) ఊరటనిచ్చే అంశమని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. కరోనా కేసుల సంఖ్యతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ టీకా బూస్టర్ డోసులను తీసుకుంటే కరోనా దరిచేరకుండా నిరోధించవచ్చని చెబుతున్నారు. కాగా.. ఢిల్లీలో ఏప్రిల్ 12న తొలిసారిగా కరోనా రోజువారి కేసుల సంఖ్య వెయ్యి మార్కు దాటింది. నాటి నుంచి ప్రతి రోజు వెయ్యికి పైగానే కరోనా కేసులు బయటపడుతున్నాయి. 

ఈ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి ఇటీవల వ్యాఖ్యానించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే.. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో ముందుకు రావడంతో కూడా కేసుల్లో భారీ పెరుగుదలకు ఓ కారణం అయి ఉంటుందని వ్యాఖ్యానించారు. కాగా.. కరోనా సంసిద్ధతను పరీక్షించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఏప్రిల్ 11న పలు ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించింది.


More Telugu News