హత్య రోజు రాత్రంతా అవినాశ్ ఫోన్ ను అసాధారణ రీతిలో వాడినట్టు గుర్తించాం: కోర్టులో సీబీఐ

  • వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
  • ముందస్తు బెయిల్ కోసం అవినాశ్ రెడ్డి పిటిషన్
  • తెలంగాణ హైకోర్టులో విచారణ
  • అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దన్న సీబీఐ
  • వివేకా హత్య కుట్ర అతడికి ముందే తెలుసని స్పష్టీకరణ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ పై విచారణ ఇవాళ కూడా కొనసాగింది. అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని, అతడి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని సీబీఐ వాదించింది. 

గత నాలుగు విచారణల్లో అవినాశ్ సహకరించలేదని ఆరోపించింది. వివేకా హత్య కుట్ర అవినాశ్ రెడ్డికి తెలుసని సీబీఐ స్పష్టం చేసింది. హత్యకు ముందు, హత్య తర్వాత అవినాశ్ ఇంట్లో సునీల్, ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నారని వివరించింది. సునీల్, ఉదయ్, జయప్రకాశ్ రెడ్డితో అవినాశ్ కు ఉన్న సంబంధాలు తెలుసుకోవాల్సి ఉందని సీబీఐ హైకోర్టు ధర్మాసనానికి విన్నవించింది. హత్యను గుండెపోటుగా ఎందుకు చిత్రీకరించారో తెలియాలని పేర్కొంది. 

హత్య రోజు ఉదయం అవినాశ్ జమ్మలమడుగు దగ్గర్లో ఉన్నట్టు చెప్పారని, కానీ ఆ సమయంలో అవినాశ్ ఇంట్లోనే ఉన్నట్టు అతడి మొబైల్ సిగ్నల్స్ ద్వారా తెలుస్తోందని సీబీఐ వెల్లడించింది. హత్య రోజు రాత్రంతా అవినాశ్ ఫోన్ ను అసాధారణంగా వాడినట్టు గుర్తించామని తెలిపింది. 

ఇక, ఈ కేసులో వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా, ఆమె తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. అనంతరం, మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.


More Telugu News