హరీశ్ రావు చేసిన విమర్శలకు జగన్ సమాధానం చెప్పాలి: సీపీఐ రామకృష్ణ

  • హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని జగన్ కు రామకృష్ణ ప్రశ్న
  • ప్రత్యేక హోదా గురించి మాట్లాడటమే లేదని మండిపాటు
  • నాలుగేళ్లలో మీరు సాధించింది ఏమిటని ప్రశ్న
ఏపీ పరిస్థితిపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా మెడలు వంచి ప్రత్యేక హోదాను తీసుకొస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడటమే లేదని విమర్శించారు. ఇంత మంది ఎంపీలను పెట్టుకుని ప్రత్యేక హోదా విషయంలో సాధించింది ఏమిటని అడిగారు. 

విభజన చట్టంలోని హామీలను సాధించలేదని... వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి నిధుల సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాలు ఎందుకు జరగడం లేదని అడిగారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో మీరు సాధించింది ఏమిటి జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. 

మరోవైపు ఇటీవల హరీశ్ రావు మాట్లాడుతూ మరోసారి ఏపీ మంత్రులపై నిప్పులు చెరిగారు. తాను ఏపీ ప్రజలను ఏమీ అనలేదని, తాను ఏపీ ప్రజల పక్షాన మాట్లాడానని చెప్పారు. ఏపీ పాలకులకు చేతనైతే ప్రత్యేక హోదా గురించి పోరాడాలని, విశాఖ ఉక్కు కోసం పోరాడాలని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తాము నీళ్లు ఇచ్చినట్టు ఇవ్వాలని సవాల్ విసిరారు.


More Telugu News