క్రమశిక్షణ దాటిన విరాట్ కోహ్లీకి జరిమానా

  • మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత
  • ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి లెవల్ 1 ఉల్లంఘన
  • ప్రకటించిన ఐపీఎల్ క్రమశిక్షణా కమిటీ
  • చెన్నై బ్యాటర్ దూబే అవుట్ అయినప్పుడు కోహ్లీ వింత శైలి
విరాట్ కోహ్లీ సంతోషం కలిగితే చిత్ర విచిత్రంగా మైదానంలో హావభావాలు ప్రదర్శించడం అభిమానులకు పరిచయమే. మరోసారి అలాంటి ఘటనే జరిగింది. దీన్ని ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద ఐపీఎల్ పాలక మండలి భావించి జరిమానా విధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది.

ఈ పోటీలో చివరికి 8 పరుగుల తేడాతో చెన్నై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 226 పరుగులు చేసింది. చెన్నై వైపు దేవాన్ కాన్వే, శివమ్ దూబే, అజింక్య రహానే బ్యాటింగ్ తో రాణించారు. శివమ్ దూబే 52 పరుగులకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ సమయంలో కోహ్లీ పట్టరాని ఆనందంతో ఊగిపోవడమే కాకుండా, ఏవో వ్యాఖ్యలు చేయడం అతడిపై చర్యకు కారణమైనట్టు తెలుస్తోంది. కేవలం 26 బంతులకే 52 పరుగులు చేసిన దూబే పార్నెల్ బౌలింగ్ లో అద్భుతమైన షాట్ గా మలచగా, అది వెళ్లి బౌండరీ లైన్ వద్దనున్న ఫీల్డర్ సిరాజ్ చేతులకు చిక్కింది. ఆ సమయంలో కోహ్లీ వ్యవహారశైలిని ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా భావించినట్టు తెలుస్తోంది.

‘‘రాయల్ చాలెంజర్స్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాగా విధించడం జరిగింది. చెన్నైతో మ్యాచ్ సందర్భంగా అతడు ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 కింద లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు’’అని ప్రకటన విడుదలైంది.


More Telugu News