కర్ణాటక ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వని బీజేపీ!

  • వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు
  • 222 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
  • ఒక్క మైనారిటీకి కూడా టికెట్ కేటాయించని కాషాయ పార్టీ
  • దుమ్మెత్తి పోస్తున్న కాంగ్రెస్, జేడీఎస్
వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నేతలు, పోయే నేతలతో పార్టీలన్నీ బిజీగా ఉన్నాయి. బీజేపీ సహా ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. మొత్తం 224 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా బీజేపీ ఇప్పటికే 222 మంది అభ్యర్థులను ప్రకటించింది. 

అందరూ ఊహించినట్టుగానే ఈసారి కూడా కమలం పార్టీ హిందూయేతర అభ్యర్థి ఒక్కరికీ టికెట్ ఇవ్వలేదు. కాషాయ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఒక్క ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ లేకపోవడం గమనార్హం. ఇంకా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా అవి కూడా మైనారిటీలకు దక్కే అవకాశం లేదని చెబుతున్నారు. 

మైనారిటీలకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్, జేడీఎస్ తీవ్రంగా మండిపడ్డాయి. మైనారిటీలపై తనకున్న విద్వేషాన్ని బీజేపీ మరోమారు బయటపెట్టుకుందని కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తూ ట్వీట్ చేసింది. గత ఎన్నికల్లోనూ బీజేపీ ఒక్క మైనారిటీ అభ్యర్థిని కూడా బరిలోకి దించలేదు. ప్రస్తుత బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంలోని మైనారిటీ శాఖను కూడా ఇతరులే నిర్వహిస్తుండడం గమనార్హం.


More Telugu News