అవినాశ్ రెడ్డిని అవసరమైతే అదుపులోకి తీసుకుంటామని కోర్టుకు తెలిపిన సీబీఐ

  • వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సహనిందితుడిగా చేర్చిన సీబీఐ
  • ఈ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని అవినాశ్ కు నోటీసులు
  • ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన అవినాశ్
  • కోర్టులో విచారణ ప్రారంభం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. అవినాశ్ పిటిషన్ పై ఈ మధ్యాహ్నం 3.45 గంటలకు వాదోపవాదాలు మొదలయ్యాయి. దస్తగిరి స్టేట్ మెంట్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న సీబీఐ అధికారులు, వివేకా రెండో పెళ్లి కోణాన్ని పట్టించుకోవడంలేదని అవినాశ్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. అటు, వివేకా కుమార్తె కూడా ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. 

వాదనల సందర్భంగా.... అరెస్ట్ చేస్తారన్న అవినాశ్ రెడ్డి వ్యాఖ్యలపై న్యాయమూర్తి సీబీఐ స్పందన కోరారు. అందుకు సీబీఐ తరఫు న్యాయవాది బదులిస్తూ... అవసరమైతే అవినాశ్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంటుందని స్పష్టతనిచ్చారు. 

అటు, అవినాశ్ రెడ్డి న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. వైఎస్ భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చాడని కోర్టుకు విన్నవించారు.

వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సహనిందితుడిగా చేర్చిన సీబీఐ, ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. అయితే అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అవినాశ్ రెడ్డి కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో, రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని సీబీఐ అవినాశ్ రెడ్డికి సూచించింది.


More Telugu News